టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
గేర్ మార్చిన గిల్, పంత్
శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసిన పంత్.. 31 పరుగులతో ఉన్న గిల్ శనివారం గేర్ మార్చారు. కివీస్ బౌలింగ్‌పై ఆది నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గిల్ 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
అయితే గిల్ 46 పరుగుల వద్ద ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫిలిప్స్ వేసిన బంతిని గిల్ లాంగాన్ మీదుగా తరలించగా.. ఫీల్డర్ చాప్‌మన్ క్యాచ్ పట్టేందుకు వచ్చి విఫలమయ్యాడు. దీంతో గిల్‌కు లైఫ్ లభించింది.
పంత్ మెరుపు హాఫ్ సెంచరీ
ఇక రిషభ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే యాభై పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో 31 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది.
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ మూడూ గెలవడం ఖాయమని.. రోహిత్ సేన సులువుగానే ఫైనల్‌కు చేరుతుందని సిరీస్ ఆరంభంలో అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.
బెంగళూరు, పుణెలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండింటిలో ఓటమి తప్పలేదు. ఫలితంగా పన్నెండేళ్ల తర్వాత భారత్ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.
తొలిరోజు ఆటలో రాణించిన జడ్డూ, వాషీ..
కానీ.. ఇక్కడా టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. తొలిరోజు బౌలర్లు శుభారంభం అందించినా.. బ్యాటర్లు దానిని నిలబెట్టలేకపోయారు. కాగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుత రీతిలో రాణించి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.
జడ్డూ ఐదు, వాషీ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్(ఒక వికెట్) కూడా తన వంతు సహకారం అందించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరి
భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే కెప్టెన్, రోహిత్ శర్మ(18 బంతుల్లో 18)పెవిలియన్ చేరాడు. ఆది నుంచే దూకుడుకనబరిచిన అతడు.. కివీస్ ఫీల్డర్ల తప్పిదాల వల్ల రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అగ్రెసివ్‌గా ఆడి పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ జైస్వాల్(30)ను బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీశాడు. అయితే, ఇక్కడే టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ ప్రయోగం చేసింది. నాలుగో నంబర్‌లో నైట్‌వాచ్‌మన్‌గా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పంపించింది.
ఆఖరి 15 నిమిషాల్లో అంతా తలకిందులు
జైస్వాల్ స్థానంలో సిరాజ్ క్రీజులోకి వచ్చీ రాగానే.. అజాజ్ పటేల్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(4).. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. ఫలితంగా టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే 149 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ ఒకటి, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిజానికి శుక్రవారం 4. 45 నిమిషాల వరకు టీమిండియాదే పైచేయి. కానీ పదిహేను నిమిషాల్లోనే అంతా తారుమారైంది. జైస్వాల్, సిరాజ్, కోహ్లి అవుటైన తర్వాత కివీస్ పటిష్ట స్థితికి చేరుకుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)
👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్
👉కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్
👉తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 86/4 (19)
తుది జట్లు
భారత్:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్
టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ.
చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి
Ind vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి!
Comments
Please login to add a commentAdd a comment