విధ్వంసకర ఇన్నింగ్స్‌.. భారత తొలి క్రికెటర్‌గా పంత్‌ రికార్డు | Ind vs NZ 3rd Test: Pant Explosive 36-Ball Fifty Breaks Jaiswal Record | Sakshi
Sakshi News home page

విధ్వంసకర ఇన్నింగ్స్‌.. భారత తొలి క్రికెటర్‌గా పంత్‌ రికార్డు

Published Sat, Nov 2 2024 1:15 PM | Last Updated on Sat, Nov 2 2024 10:57 PM

Ind vs NZ 3rd Test: Pant Explosive 36-Ball Fifty Breaks Jaiswal Record

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్‌ సేన స్వదేశంలో కివీస్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

పాత కథను పునరావృతం చేస్తూ
తొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్‌వాచ్‌మెన్లు శుబ్‌మన్‌ గిల్‌, రిషభ​ పంత్‌ దూకుడుగా ఆడారు.

యశస్వి జైస్వాల్‌ రికార్డు బద్దలు 
గిల్‌ 66 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్‌ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.

కాగా కివీస్‌తో తాజా సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో  ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, పంత్‌ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్‌ను వెనక్కినెట్టి నంబర్‌ వన్‌గా అవతరించాడు.  

గిల్‌ సెంచరీ మిస్‌ 
ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్‌(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్‌ శర్మ(18), మహ్మద్‌ సిరాజ్‌(0), విరాట్‌ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్‌, పంత్‌ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.

దురదృష్టవశాత్తూ గిల్‌ సెంచరీ(90) మిస్‌ కాగా.. పంత్‌ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 

ఇక వాషింగ్టన్‌ సుందర్‌(36 బంతుల్లో 38 నాటౌట్‌) నిలకడగా ఆడినా.. ఆకాశ్‌ దీప్‌ రనౌట్‌ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. కివీస్‌ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌, ఇష్‌ సోధి, మ్యాట్‌ హెన్రీ ఒక్కో వికెట్‌ తీశారు.

చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్‌, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement