న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. ముంబై.. వాంఖడే మైదానం.. రిషభ్ పంత్ ఇంకాసేపు క్రీజులో నిలబడితే చాలు.. టీమిండియా గెలవడం ఖాయం.. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో పంత్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడం అందరికీ షాకిచ్చింది.
నిజానికి ఫీల్డ్ అంపైర్ పంత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. అజాజ్ వేసిన బంతి పంత్ బ్యాట్‌ను కాకుండా ప్యాడ్లను తాకిందనే ఉద్దేశంతో.. అజాజ్ అప్పీలు చేసినా అంపైర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. పంత్ సైతం అదే ధీమాతో క్రీజులో నిలబడి చిరునవ్వులు చిందించాడు.
అయితే, కివీస్ మాత్రం రివ్యూకు వెళ్లింది. అందులో బంతి బ్యాట్ అంచును తాకినట్లుగా కనిపించింది. అయితే, అదే సమయంలో బ్యాట్ ప్యాడ్లను తాకిన తాకిందని పంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ బంతి బ్యాట్‌ను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయంటూ థర్డ్ అంపైర్ పంత్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
కానీ పంత్ మాత్రం మైదానాన్ని వీడేందుకు ఇష్టపడక కాసేపు ఫీల్డ్ అంపైర్లతో వాదించి.. ఇక లాభం లేదనుకుని పెవిలియన్ చేరాడు. పంత్ నిష్క్రమణ తర్వాత భారత్ ఓటమి ఖారారై.. కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో పంత్ అవుటైన తీరు విస్తృతంగా చర్చకు వచ్చింది.
ఈ క్రమంలోనే చాలా మంది హాట్‌స్పాట్ టెక్నాలజీ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్‌ఎస్)లో ఈ సాంకేతికతను కూడా బీసీసీఐ చేర్చుకుని ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
హాట్‌స్పాట్ టెక్నాలజీ అంటే ఏమిటి?
ఫ్రెంచ్ శాస్త్రవేత్త నికోలస్ బియాన్ హాట్‌స్పాట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రక్షణ దళాలు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలుగా ఈ సాంకేతికతను రూపొందించారు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. చీకట్లో, పొగ కమ్ముకున్న సమయంలో యుద్ధ ట్యాంకులు, విమానాల కదలికలను పసిగట్టడం కోసం దీనిని వాడతారు.
క్రికెట్‌లో హాట్‌స్పాట్
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య 2006-07 నాటి యాషెస్ సిరీస్ సందర్భంగా క్రికెట్‌లో హాట్‌స్పాట్ టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించారు. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల ద్వారా బంతి బ్యాటర్‌కు శరీరానికి తగిలిందో లేదో పరిశీలించే వీలు కలుగుతుంది. డీఆర్‌ఎస్‌ను మరింత సరళతరంగా, కచ్చితంగా మార్చేందుకు ఈ సాంకేతికతను వాడారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, యూఏఈలలో కూడా ఈ హాట్‌స్పాట్ టెక్నాలజీని ఉపయోగించారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే?
బౌలర్ సైడ్ రెండు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను అమరుస్తారు. బంతిని బ్యాటర్ శరీరాన్ని లేదంటే ప్యాడ్‌ను తాకినపుడు వెలువడ్డ ఉష్ణోగ్రత ఆధారంగా నెగటివ్ ఇమేజ్ ద్వారా ఏ పాయింట్లో బంతి తాకిందో గుర్తిస్తారు. బంతి బ్యాట్ అంచును తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కచ్చితత్వం ఎంత?
హాట్‌స్పాట్ చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి. 2011లో భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు ఈ టెక్నాలజీ వాడగా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. వీవీఎస్ లక్ష్మణ్ అవుట్ కాకుండా లైఫ్ పొందిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ సాంకేతికతను తప్పుబట్టాడు. ఇక టూల్ ఇన్వెంటర్ వారెన్ బ్రెనాన్ సైతం పూత ఉండే బ్యాట్ల విషయంలో ఈ టెక్నాలజీ సరిగ్గా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
ఇండియాలో ఎందుకు వాడటం లేదు?
హాట్‌స్పాట్ టెక్నాలజీ ఖరీదైనదని బీసీసీఐ, బ్రాడ్‌కాస్ట్ వర్గాలు అంటున్నాయి. ఒక్క కిట్ కోసం రోజుకు పది వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. ఇంతచేసినా కచ్చితమైన ఫలితాలు పొందలేమని పేర్కొంటున్నాయి.
అందుకే ఈ టెక్నాలజీని ఇండియాలో వాడటం లేదని.. స్కై స్పోర్ట్స్, సూపర్‌స్పోర్ట్స్ కూడా వీటి వినియోగాన్ని ఆపేశాయని తెలిపాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం హాట్‌స్పాట్ టెక్నాలజీని ఇంత వరకు ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం విశేషం.
చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
Comments
Please login to add a commentAdd a comment