టాప్ స్పిన్నర్‌కు పీడకలగా ఐపీఎల్!
రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా టాప్ స్పిన్నర్. ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని.. స్వదేశంలో శ్రీలంకతో టీ-20 సిరీస్, బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఇలా ప్రధాన సిరీస్‌లన్నింటిలోనూ బాగానే రాణించిన అశ్విన్‌కు ప్రస్తుత ఐపీఎల్ మాత్రం పీడకలగా మారింది. 2009 నుంచి 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు నమ్మకమైన స్పిన్నర్‌గా ఉన్న అశ్విన్ తాజాగా కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. కొత్త జట్టుతో ఆడుతున్న అశ్విన్‌కు ఏమాత్రం కలిసిరాకపోగా.. ప్రస్తుత ఐపీఎల్‌లో తొలిసారి ఈ టాప్ స్పిన్నర్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగంటే నాలుగు వికెట్లే పడగొట్టాడు.
దీంతో అశ్విన్‌పై నమ్మకం పెట్టుకొని.. అతనికి బంతిని ఇస్తున్న పుణె కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీరుపైనా విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవైపు అశ్విన్ ఈ ఐపీఎల్ అదృష్టం కూడా కలిసిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుస టోర్నమెంట్లు ఆడుస్తూ వస్తుండటం క్రికెటర్లపై భారం మోపుతున్నదని, ఆ ప్రభావం అశ్విన్ పై ఉండొచ్చునని పరిశీలకులు అంటున్నారు. దీనికితోడు భారత్ లోని మైదానాలు చిన్నవి కావడం.. వాటిలో సగం షాట్ కొట్టినా బంతి బౌండరికి వెళుతుండటంతో ఈ ఐపీఎల్ స్పిన్నర్లకు చేదు అనుభవాన్ని మిగిలిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారు.
చెన్నైకి సింహం.. పుణెకి ఉడత!
ఐపీఎల్‌లో అశ్విన్ గత ప్రదర్శన చూస్తే ఇదే అనిపిస్తుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 90 వికెట్లు పడగొట్టాడు. చెన్నై జట్టు రద్దయి.. కొత్తగా వచ్చిన పుణె జట్టుతో చేరిన అశ్విన్ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. టాప్ స్పిన్నర్ నుంచి ఒక ఆర్డినరీ బౌలర్‌గా కూడా అతన్ని పరిగణనలోకి తీసుకొని పరిస్థితి తలెత్తింది. దీనికితోడు ఇటీవల హైదరాబాద్ సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అశ్విన్ కోటా నాలుగు ఓవర్లు పూర్తిగా వేసేందుకు అనుమతించలేదు. ఇప్పటివరకు నాలుగు వికెట్లు మాత్రమే తీసిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు ఇది అవమానం లాంటిందే.
అశ్విన్ ఏమంటున్నాడు!
'ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇతర దేశాల మైదానాలతో పోలిస్తే భారత్‌లోని మైదానాలు క్వార్టర్ (25శాతం) మాత్రమే ఉంటాయి. దీంతో మాములు షాట్ కొట్టినా బంతి బౌండరీ ఫెన్సింగ్ ను ఈజీగా దాటిపోతుందని బ్యాట్స్‌మెన్ భావిస్తారు. దీంతో ఐపీఎల్‌లో బౌలింగ్ చేయడం స్పిన్నర్లకు చాలా రిస్కీగా మారిపోయింది' అని అశ్విన్ ఈఎస్పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అభిప్రాయపడ్డాడు.
మిగతా స్పిన్నర్ల పరిస్థితి ఏంటి?
అశ్విన్ ఒకవైపు చిక్కులు ఎదుర్కొంటుండగా.. అతని సమకాలీకుడైన అమిత్ మిశ్రా పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-10 బౌలర్ల జాబితాలో మిశ్రా చోటు సాధించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరఫున రెండో మ్యాచ్ ఆడిన యాడం జంపా 19 పరుగులకే రెండు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ ఇద్దరు మినహాయిస్తే మిగతా స్పిన్నర్ల పరిస్థితి అశ్విన్ లాగా కనిపిస్తోంది.