
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చెలరేగిన గ్రీన్ కోసం వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు ఎగబడతాయని జోస్యం చెప్పాడు. ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ గ్రీన్ కోసం కోట్లు కుమ్మరించడం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
బంతిని బలంగా బాదడంతో పాటు భీకరమైన పేస్‌తో బౌలింగ్ చేయడం గ్రీన్ ప్రధాన ఆయుధాలని వర్ణించాడు. బౌలింగ్ చేసేప్పుడు గ్రీన్‌కు అతని పొడవు అదనపు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపాడు. పవర్ ప్లేలో గ్రీన్ లాంటి ఆటగాడు ఉండాలని ఏ జట్టైనా కోరుకుంటుందని, తనంతట తాను తప్పుకుంటానంటే తప్ప ఏ జట్టు అతన్ని తప్పించే సాహసం చేయలేదంటూ గ్రీన్‌ను ఆకాశానితకెత్తాడు. ఇటీవలే ప్రకటించిన భారత టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్.. ఓ విదేశీ ఆటగాడిని ఇలా పొగడ్తలతో ముంచెత్తడం ఆసక్తికరంగా మారింది.
కాగా, ఆసీస్ యంగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు లభించిన ఆణిముత్యమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లో అతను ఓటమి అంచుల్లో ఉన్న ఆసీస్‌ను అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో (89 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. 2020లో భారత్‌పైనే అరంగేట్రం చేసిన గ్రీన్.. ఇప్పటివరకు 14 టెస్ట్‌లు, 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఇందులో 6 అర్ధశతకాల సాయంతో 995 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అతను 29 వికెట్లు పడగొట్టాడు.