నాకు అండగా నిలవలేదు: అశ్విన్‌ | Felt Like A Hard Slap,R Ashwin On Being Dropped From CSK | Sakshi
Sakshi News home page

నాకు అండగా నిలవలేదు: అశ్విన్‌

Published Mon, Apr 27 2020 3:07 PM | Last Updated on Mon, Apr 27 2020 3:08 PM

Felt Like A Hard Slap,R Ashwin On Being Dropped From CSK - Sakshi

అశ్విన్‌-ధోని(ఫైల్‌ఫొటో)

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రవిచంద్రన్‌ అశ్విన్‌ సుదీర్ఘ కాలం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫునే క్రికెట్‌ ఆడాడు. 2009లో  ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అశ్విన్‌.. ఏడు సీజన్ల పాటు సీఎస్‌కేకే ప్రాతినిథ్యం వహించాడు. అందులో 2010, 2011ల్లో సీఎస్‌కే టైటిల్స్‌ గెలవగా అశ్విన్‌ భాగమయ్యాడు. అయితే 2010 సీజన్‌ తన ఓవరాల్‌ కెరీర్‌కు ఒక చెంపపెట్టు అని అశ్విన్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. దశాబ్ద  కాలం నాటి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న అశ్విన్‌.. తాను క్లిష్లమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపాడు. 2010 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ ప్రదర్శన చెత్తగా ఉండటంతో తనను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చొబెట్టారన్నాడు. దాని ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అశ్విన్‌ తెలిపాడు. ‘ 2010 సీజన్‌ నాకు ఒక చెంపపెట్టు. నేను జట్టు నుంచి ఉద్వాసనకు గురైనప్పుడు నాతో కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఏమీ మాట్లాడలేదు. అంతే కాకుండా నాకు అండగా కూడా నిలవలేదు. అది డైరెక్ట్‌గా నా ముఖంపై కొట్టినట్లు అనిపించింది. (‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’)

ఆర్సీబీతో బెంగళూరులో జరిగిన ఒక మ్యాచ్‌లో రాబిన్‌ ఊతప్ప, మార్క్‌ బౌచర్‌లు నా బౌలింగ్‌ను చితక్కొట్టారు. అప్పటివరకూ టీ20ల్లో బౌలింగ్‌ ఇంత చాలెంజ్‌గా ఉంటుందని అనుకోలేదు. టీ20ల్లో వికెట్లు ఎక్కువ సాధించవచ్చని అప్పటివరకూ ఉన్న అభిప్రాయం తప్పని తేలింది. నేను వికెట్లు తీయకపోగా 40 నుంచి 45 పరుగులు వరకూ ఇచ్చా. ఆ తర్వాత గేమ్‌లో కూడా చెత్త గణాంకాలు నమోదు చేశా. సూపర్‌ ఓవర్‌కు వెళ్లిన ఆ మ్యాచ్‌లో మేము ఓడిపోయాం. దాంతో నన్ను జట్టులో నుంచి తప్పించారు. ఈ విషయాన్ని కోచ్‌ కనీసం చెప్పలేదు. నాకు మద్దతుగా నిలవలేదు కూడా. నేను హోటల్‌ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయా. అప్పుడు ఒక నిబంధన ఉండేది. హోమ్‌ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తొలి 18 ఆటగాళ్ల జాబితాలో లేని వారు ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. (బుమ్రాకు ‘చుక్కలు’ చూపించాడు..!)

హోటల్‌ బిల్లులను సేవ్‌ చేయాలనే ఉద్దేశం అప్పుడు అలా ఉండేది. దాంతో ఇంటి దగ్గర ఉండే సీఎస్‌కే మ్యాచ్‌లు  చూశా. నాకు సీఎస్‌కే ఎందుకు అండగా నిలవలేదు అనే బాధ ఉండేది. నేను తొలి మూడు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ బాగా చేసి, మిగతా రెండు మ్యాచ్‌ల్లో చెత్త గణాంకాలు నమోదు చేసే సరికి నాతో మాట కూడా చెప్పకుండా తప్పించారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఎంతటి గొప్ప బౌలర్‌ అయినా పరుగులు సమర్పించుకోవడం సాధారణం. 2010లో వెస్టిండీస్‌లో జరిగిన వరల్డ్‌ టీ20 ప్రాబబుల్స్‌లో కూడా నాకు అవకాశం దక్కలేదు.  ఆ తర్వాత భిన్నమైన పిచ్‌ల్లో ఎలా బౌలింగ్‌  చేయాలనే విషయం నేర్చుకుంటూ ముందుకు సాగా.ఇంగ్లండ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటంతో నా స్పిన్‌ బౌలింగ్‌ మరింత మెరుగుపడింది. 2013-14 సీజన్‌లో దక్షిణాఫ్రికా పర్యటన కూడా నాకు లాభించింది. స్పిన్‌లో రాటుదేలుతూ ముందుకు సాగా. సీఎస్‌కేతో  ఉద్వాసన గురైనప్పుడు నాతో ఫ్లెమింగ్‌ వ్యహరించిన తీరు నాకు  నచ్చలేదు. దాంతో నాలో పట్టుదల పెరిగింది’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement