‘స్పిన్‌’ ఖాన్‌... | Mystery Spinner Rashid Khan success story | Sakshi
Sakshi News home page

‘స్పిన్‌’ ఖాన్‌...

Published Thu, May 10 2018 4:04 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Mystery Spinner Rashid Khan success story - Sakshi

నిత్యం బాంబు పేలుళ్ల మోత... నలుదిక్కుల నుంచి పొంచి ఉన్న ముప్పు... తెలతెలవారుతూనే తుపాకి కాల్పుల గర్జన... క్షణక్షణం భయం గుప్పిట జీవనం... ఆటల కంటే ఆధిపత్య కొట్లాటలే ఎక్కువ... మనిషి ప్రాణం సుడిగాల్లో దీపం... ఇలాంటిచోట క్రీడలనే మాటకు చోటుంటుందా...? ఆ ప్రతిభ అంతర్జాతీయ స్థాయికెదుగుతుందా? ఎందుకంత అనుమానం? ఇతడే దానికి సమాధానం... ఆ మొనగాడే అఫ్గానిస్తాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.  

సాక్షి క్రీడా విభాగం:  అఫ్గానిస్తాన్‌...! ప్రపంచ పటంలోనే కల్లోలిత దేశం. పర్వతాలు, కొండలతో కూడిన ఈ దేశాన్ని ఉగ్రవాదం నిలువునా దహించి వేసింది. అలాంటిచోట క్రికెట్‌ ఆడటమే గొప్పనుకుంటే... ఏకంగా జట్టే పుట్టుకొచ్చింది. గింగిరాల గూగ్లీలు, సర్రున దూసుకొచ్చే ఫ్లైటెడ్‌ డెలివరీలు, రెప్పపాటులో వికెట్‌ను గిరాటేసే టర్న్‌ బంతులు సంధించేవారు లేక ఒకనాటి కలగా మారుతున్న కళాత్మక లెగ్‌ స్పిన్‌కు ప్రాణం పోసే రషీద్‌ ఖాన్‌ వంటి స్పిన్‌ ఆణిముత్యాన్ని అందించింది.

లీగ్‌ ఏదైనా, టోర్నీ ఎక్కడైనా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎంత మొనగాడైనా తన మాయాజాలం ముందు దిగదుడుపే. దాదాపు మూడేళ్లుగా ఆడుతున్నా అతడింకా ‘మిస్టరీ’ స్పిన్నర్‌గానే ఉన్నాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి టి20 ఫార్మాట్‌ వచ్చాక ‘ఒంటి చేత్తో’ గెలిపించడం అనే పదం వాడకం తగ్గింది. రషీద్‌ విషయంలో మాత్రం దానిని వర్తింపజేయొచ్చు. ప్రస్తుత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రషీద్‌ బౌలింగ్‌లో గేల్, రైనా భారీగా పరుగులు సాధిం చారు. చివరకు అవే ఫలితాన్ని మార్చాయి. దీన్నిబట్టే చెప్పొచ్చు తన బౌలింగ్‌ ప్రభావం ఎంతో!

ఆరుగురు స్పిన్‌ అన్నదమ్ముల్లో...
అఫ్గాన్‌లో ఇంత క్రికెట్‌ ప్రతిభ ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్న రషీద్‌ నేపథ్యం కూడా అంతే ఆసక్తికరం. అతడి ఆరుగురు అన్నదమ్ములూ లెగ్‌ స్పిన్నర్లే. వారి నుంచి అబ్బిన ఆటకు వేగమనే సహజ నైపుణ్యం తోడవడం, కోచ్‌లెవరూ అతడి శైలిని మార్చడానికి ప్రయత్నించకుండా మరింత విశ్వాసం నింపడంతో ఇక తిరుగులేకపోయింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అఫ్గాన్‌ అండర్‌–19 కోచ్‌ దౌలత్‌ అహ్మద్జాయ్‌ గురించి. అతడు రషీద్‌ను వెన్నుతట్టి, మంచి భవిష్యత్‌ ఉంటుందని ప్రోత్సహించాడు. బంతిని ఎలా వదలాలి? ఎలా పట్టుకోవాలి? శైలి ఎలా ఉండాలి? వంటి ప్రాథమిక అంశాలను రషీద్‌ ఎవరి దగ్గరా నేర్చుకోకపోవడం విశేషం.

అన్నీ స్వతహాగా వచ్చేశాయంతే!
ఒకరిద్దరు తప్ప ప్రపంచ వ్యాప్తంగా బ్యాట్స్‌మెన్‌ ఇప్పటికీ అతడి స్పిన్‌ ‘మిస్టరీ’ని ఛేదించలేక సతమత మవుతుంటే తన దగ్గర మరిన్ని అస్త్రాలు ఉన్నాయంటున్నాడు రషీద్‌. చాలా విషయాలు సొంతంగానే నేర్చుకునే ఈ అఫ్గానీ... నెట్స్‌లో సాధన చేసిన చాలా రహస్య బంతులను ఇంకా మ్యాచ్‌ల్లో వేయలేదని చెబుతుండటం గమనార్హం. ఇతడి శైలిని చూసిన శ్రీలంక మాజీ స్పిన్‌ దిగ్గజం, సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అంతా పక్కాగా ఉందని కితాబివ్వడం రషీద్‌కు దక్కిన గౌరవం. ఇదే సందర్భంలో ‘బంతిని ఎక్కడ వేయాలనుకుంటున్నావో ఆ ప్రదేశాన్నే లక్ష్యం చేసుకో’ అంటూ మురళీ సూచించిన ‘స్పాట్‌ బౌలింగ్‌’ టెక్నిక్‌ అతనికి మరింత ఉపయుక్తంగా మారింది.

తప్పుల నుంచి నేర్చుకుంటూ...
బాడీ లాంగ్వేజ్‌ చూస్తే రషీద్‌ ఎవరి మాట వినడు తరహాలో కనిపిస్తాడు. కానీ అతడు తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే స్వభావి. ‘కొన్నిసార్లు పిచ్‌లు సహా ఏదీ కలిసిరాదు. బ్యాట్స్‌మెన్‌ మంచి బంతులనూ బాదేస్తారు. అలాంటి అనుభవాన్నీ సానుకూలంగా తీసుకుంటా. ఆ తప్పులు మళ్లీ చేయకుండా చూసుకుంటా’ అనే తన మాటలే దీనికి నిదర్శనం. ప్రస్తుత లీగ్‌లో ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ గేల్, రైనా తన బౌలింగ్‌ను చదివేశారని అనుమానం రాగానే వెంటనే వీడియో విశ్లేషణ చేసుకున్నాడు. కోచ్‌లతో మాట్లాడాడు. ఫుల్‌ లెంగ్త్‌ బంతులను ఎక్కువగా వేయడం, బ్యాట్స్‌మెన్‌ వాటిని చక్కగా కనెక్ట్‌ చేసుకోవడం తప్ప ఏ పొరపాటూ లేదని తేలాక కాని తను ఊరట పొందలేదు. ఈ తప్పులను మరుసటి మ్యాచ్‌కే సరిదిద్దుకుని ఎప్పటిలానే రాణించడం రషీద్‌ ఎలాంటివాడో చెబుతోంది.

ఏ స్థితిలోనైనా సిద్ధమే...
అనిల్‌ కుంబ్లే, షాహిద్‌ ఆఫిద్రి శైలిలో బంతిని వేగంగా వేసే రషీద్‌... ఎక్కడ ఆడుతున్నామనేదానిపై కాకుండా లెంగ్త్‌పై మాత్రమే దృష్టి పెడతాడు. మ్యాచ్‌లో ఎన్ని మంచి బంతులేశాం? ఎన్ని చెడ్డ బంతులేశాం? అని లెక్కేసుకుంటాడు. కోచ్‌లతో పాటు బ్యాట్స్‌మెన్‌నూ ఈ విషయమై సంప్రదిస్తాడు. ఎవరికి ఎలాంటి బంతులేయాలనే సలహాల కోసం విలియమ్సన్, ధావన్, యూసుఫ్‌ పఠాన్, మనీశ్‌ పాండే వంటి సీనియర్లతో చర్చిస్తాడు. వాటిని పాటిస్తూ ఫలితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ‘మ్యాచ్‌ ప్రారంభ ఓవర్లైనా సరే, చివరి ఓవర్లైనా సరే బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమే. జట్టుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బంతినివ్వండి’ అనే రషీద్‌ ఆత్మవిశ్వాసం ఏ కెప్టెన్‌కైనా వరమే.

ముందున్న సవాళ్లను దాటితే...
టి20ల్లో కొరకరాని కొయ్యగా మారడం, వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌ కావడం రషీద్‌ను ప్రత్యేకంగా చూపుతున్నా, రాబోయే కాలం అతడి ప్రతిభకు నిజమైన పరీక్షే. వచ్చే నెలలో అఫ్గాన్‌ జట్టు భారత్‌తో టెస్టు అరంగేట్రం చేయనుంది. ఇక నుంచి ఐదు రోజుల సమరంలో అతడెంతవరకు నిలుస్తాడో చూడాలి. ఇక 2019 ప్రపంచకప్‌ మరో పెద్ద సవాల్‌. ఈలోగా అఫ్గాన్‌ జట్టు కొన్ని వన్డేలైనా ఆడుతుంది. అంటే మిస్టరీ స్పిన్నర్‌కు అసలు సిసలు ఆట ఎదురుకాబోతోంది. చూద్దాం... మరి ఇంకెంత కాలం తన జోరు సాగుతుందో? ఏ బ్యాట్స్‌మన్‌ దానికి అడ్డుకట్ట వేస్తాడో?

బ్యాట్స్‌మన్‌ ఏం చేస్తాడన్నది మర్చిపో. మానసికంగా దృఢంగా ఉండటం ఎప్పుడూ మేలు చేస్తుంది. సామర్థ్యాన్ని నమ్ముకో అని మురళీధరన్‌ పదేపదే చెబుతారు. మిగతా ఇద్దరు కోచ్‌లు మూడీ, లక్ష్మణ్‌ కూడా వైఫల్యాలకు బెదరొద్దంటారు. కొద్దిగా షార్ట్‌ బంతులు వేయమని వారిచ్చిన సలహా నా విజయానికి కారణం. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేయడం ఇష్టమైనా, మ్యాచ్‌లోకి వచ్చేసరికి కుడి, ఎడమా అనేది చూడను. నేను సరైన ప్రదేశంలో బంతిని వేశానంటే ఏ బ్యాట్స్‌మనూ పరుగులు చేయలేడు. మొదటి నుంచి వేగం అలవాటైంది. ఐపీఎల్‌ వల్లే నేనిక్కడున్నా. ఈ అనుభవం భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. సరైన ప్రదేశంలో బంతులేయడంపైనే దృష్టిపెడతా. మిగతా పని అదే చూసుకుంటుంది.
–రషీద్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement