9, 10 తరగతుల పరీక్షల ప్రక్షాళన
ముందుగా గణితంతో పరీక్షలు మొదలు
డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు
హైదరాబాద్: పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు తెస్తోంది. 9, 10 తరగతుల పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్రథమ భాష తెలుగుతో ప్రారంభమయ్యే పరీక్షలను గణితంతో ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ఇష్టారాజ్యంగా వేస్తున్న ఇంటర్నల్ మార్కులకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈవోలకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే సమ్మేటివ్-1 పరీక్షలు వచ్చే నెల 9 నాటికి పూర్తి కానున్నాయి.
ఇక డిసెంబరు/జనవరిలో నిర్వహించే సమ్మేటివ్-2 పరీక్షల తరువాత ఇంటర్నల్ మార్కులు (20 ఇంటర్నల్స్, 80 రాత పరీక్ష) వేసే విధానంపై తనిఖీలను చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రైవేటు పాఠశాలలు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) రూపొందించిన ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. దసరా సెలవులను వచ్చే నెల 10 నుంచి 25 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.