టైరు పగిలి చెట్టును ఢీకొన్న కారు
కణేకల్లు: టైరు పగిలి కారు చెట్టును ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా తగ్గుపర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. కణేకల్లు ఎస్ఐ యువరాజు తెలిపిన వివరాలివీ.. బెలుగుప్ప మండలంలోని తగ్గుపర్తికి చెందిన శ్రీధర్నాయుడు బళ్లారి నగరంలోని విద్యానగర్లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యనారాయణకు నాలుగు నెలల క్రితం కుడితినికి చెందిన మమతతో వివాహమైంది. శ్రీధర్నాయుడు భార్య రంగమ్మ(55) మామ నాగన్న ఐదు నెలల క్రితం స్వగ్రామమైన తగ్గుపర్తిలో చనిపోవడంతో గురువారం సంవత్సరికం నిర్వహించారు. ఇందుకోసం బుధవారం బళ్లారి నుంచి శ్రీధర్నాయుడు మినహా కుటుంబమంతా స్వగ్రామానికి బయలుదేరారు.
కార్యక్రమం ముగించుకొని గురువారం మధ్యాహ్నం శాంత్రో కారులో రంగమ్మ(55), కుమారుడు సత్యనారాయణ(26), కోడలు మమత(22), మరిది ఆదినారాయణ(54) బళ్లారికి బయలుదేరారు. కణేకల్లు క్రాస్–బళ్లారి రోడ్డు మార్గమధ్యంలో యర్రగుంట గ్రామశివారులో కారు ముందు భాగంలోని కుడివైపు టైరు పగిలిపోయింది. వేగంగా వస్తున్న కారు కుడివైపున్న చింత చెట్టును బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. రంగమ్మ, మమత, ఆదినారాయణలకు బలమైన గాయాలు కావడంతో కార్లోనే చనిపోయారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోగా స్థానికులు కష్టం మీద బయటకు తీశారు. సత్యనారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. ఆర్సీ, మృతుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. రాయదుర్గం సీఐ చలపతి, కణేకల్లు ఎస్ఐ యువరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరు
ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది. శ్రీధర్నాయుడు, రంగమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భార్యతో పాటు కుమారుడు మృతి చెందడంతో ఆయన రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.