అక్కడ రోజ్‌వుడ్ కోసం రక్తపుటేరులు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ అడవులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిత్యం తుపాకుల మోతలతో ప్రతిధ్వనిస్తున్నాయి. మనుషులు రక్తంతో తడిసి ఎరుపెక్కుతున్నాయి. అక్కడ సరిహద్దు తగాదాల కారణంగా ఇరు దేశాల మధ్య యుద్ధమేమి జరగడం లేదు. ప్రపంచంలోనే విశేషాదరణ కలిగిన సియామిస్ రోజ్‌వుడ్ (నూకమాను లేదా జిట్రేగు) కోసం స్మగ్లర్లు, థాయ్‌లాండ్ సైనికుల మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇరువర్గాల మధ్య నిత్యం రక్తపుటేరులు పారుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.
కాంబోడియాలో ఐదువేల డాలర్లు విలువ చేస్తున్న ఓ క్యూబిక్ మీటర్ రోజ్‌వుడ్ చైనాకు వెళ్లేసరికి పదింతలు పెరుగుతోంది. ఈ రోజ్‌వుడ్ ఫర్నీచర్‌కు చైనాలో విపరీతమైన గిరాకీ ఉంది. నగిషీలు చెక్కిన ఓ రోజ్‌వుడ్ సింగిల్ కాట్ మంచానికి చైనాలో పదిలక్షల డాలర్ల ధర పలుకుతోంది. దీంతో స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి థాయ్‌లాండ్ అడువుల్లో కలపను అక్రమంగా నరకుతున్నారు. థాయ్ సైనికులను ఎదుర్కొనేందుకు స్మగ్లర్లు ఏకే 47 తుపాకులు, గ్రెనేడ్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో థాయ్ ప్రభుత్వం కూడా ఇటీవల తమ అటవి సిబ్బందికి నాలుగువేల ఆధునిక తుపాకులను సమకూర్చింది.
రోజ్‌వుడ్ స్మగ్లింగ్ ఇదే రేంజ్లో కొనసాగితే రోజ్‌వుడ్ అంతరించిపోతుందని భావించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం గత వారం కాంబోడియా, చైనా, వియత్నాం దేశాలతో ఓ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాంబోడియా, వియత్నాం వరకు విస్తరించిన రోజ్‌వుడ్ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. నరికివేత కారణంగా రోజ్‌వుడ్ అంతరించి పోతుండడంతో 2013లోనే అంతర్జాతీయ సదస్సులో రక్షించుకోవాల్సిన అరదైన జాతి మొక్కగా దీన్ని గుర్తించారు.
చైనా దిగుమతి చేసుకుంటున్న కలపలో ఐదోవంతు స్మగ్లింగ్ ద్వారానే వెళుతోంది. 2000 నుంచి 2013 సంవత్సరం వరకు చైనా 35 లక్షల క్యూబిక్ మీటర్ల కలపను 240 కోట్ల డాలర్లను వెచ్చించి దిగుమతి చేసుకుందని ఇన్విరాన్‌మెంటల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. దేశంలోకి అక్రమ కలప రాకుండా చైనా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని థాయ్‌లాండ్ ప్రభుత్వం భావిస్తోంది.