నా గీతం కన్నీటి జలపాతం
విశాఖపట్నం, అనకాపల్లి: ఉన్నత చదువులేవీ చదువుకోలేదు.. గంటల తరబడి సభల్లో ప్రసంగించడమూ రాదు.. సంపన్న కుటుంబంలో పుట్టలేదు.. కానీ సమాజంలో ఆదివాసీలు అనుభవిస్తున్న దుస్థితిని చూసి ఆవేదన చెంది.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న బలమైన కోరికతో పోరాడుతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు తమ్మయ్య.. నిమ్న వర్గాల అభ్యున్నతికి పోరాడుతున్న వారికి సమాలోచన సంస్థ ఏటా అందిస్తున్న ‘బాషా స్మారక అవార్డు’కు విజయనగరం జిల్లా పాచిపెంటకు చెందిన పడాల తమ్మయ్య ఎంపికయ్యారు. ఏపీ బాలల హక్కుల కమిషన్ మెంబర్ వి.గాంధీబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి చేతుల మీదుగా ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుం చి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వా డినని, పాటల రూపంలో ఆదివాసీలను చైతన్యపరుస్తున్నానని తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరులతో కలిసి చాలా పాటలు పాడానన్నారు.
ఆదివాసీల జీవన విధానాలపైడాక్యుమెంటరీ
గాంధీబాబు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల గురించి పోరాడుతున్న తమ్మయ్యలాంటి యువకుల గురించి మంచి కథనాలు రాయాలని కోరారు. సమాలోచన సంస్థ సభ్యులు బి.చక్రధర్ మాట్లాడుతూ బాషాస్మారక అవార్డు ఎంపికను తమ బృందం ఎటువంటి సిఫార్సులు లేకుండా చేస్తుందని తెలిపారు. సామాజిక కార్యకర్త పి.ఎస్. అజయ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రెజెం టేషన్ ద్వారా ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వారు అనుభవిస్తున్న దుర్భర స్థితిని వివరించా రు. సామాజిక కార్యకర్త కాంతారావు, విద్యావేత్త పి.డి.కె.రావులు అవార్డు గ్రహీత తమ్మయ్య సేవలు, ఆశయాల గురించి వివరించారు. అనంతరం గూంజ్ సంస్థ సహకారంతో 710 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు.
మరింతమంది ముందుకురావాలి
సమాజంలో అణచివేతకు గురవుతున్న ఆదివాసీల జీవనవిధానాల్లో మార్పు తీసుకురావాలని పోరాడుతున్న పడాల తమ్మయ్యను సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి అభినందించారు. పట్టణంలోని వివేకానంద చారిటబుల్ ట్రస్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన బాషా స్మారక అవార్డు ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆదివాసీల చట్టాలు, వారి హక్కులను గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం చేస్తూ తమ్మయ్య అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి అణగారిన వర్గాలో చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.