తండాలను అభివృద్ధి చేస్తా
తండాలన్నీంటికి బీటీ రోడ్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తిరుమలాయపాలెం: పాలే రు నియోజకవర్గంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లువేసి తండా వాసుల కష్టాలు తీరుస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మర్రితండా నుంచి పాతర్లపాడు వరకు రూ.1.50 కోట్ల నిధులతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, తండాలో సైడ్‌డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో మండలంలో బీటీరోడ్లు లేని గ్రామం అంటూ ఉండదన్నారు. ప్రజల కోసం తాను అన్ని పనులు చేస్తానని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుతో సాగునీటి వనరులు లేని తిరుమలాయపాలెంను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యుత్ తీగలు,ట్రాన్స్ఫార్మర్లు అధ్వానంగా ఉన్నాయని, గతంలో ఇద్దరు విద్యుదాఘాతంతో మృతి చెందారని మంత్రికి వివరించారు. వెంటనే ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీనారాయణను పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని తెలుపగా విద్యావలంటీర్‌ను నియమించాలని ఎంఈఓ సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ అధ్యక్షుడు కొప్పుల అశోక్, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, సర్పంచ్ బోడ మారు, ఎంపీడీఓ సన్యాసయ్య, తహసీల్దార్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.