నిత్య పెళ్లి కూతురిపై పీడీయాక్ట్
హైదరాబాద్ : జాయింట్ కలెక్టర్‌ను అని నమ్మించి పలు మోసాలకు పాల్పడిన ఓ మహిళపై పోలీసులు పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణగౌడ్ తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు,అలియాస్ రాణి,బుజ్జి అలియాస్ అలేఖ్యారెడ్డి,హేమలత బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లో ఉండేది. కూలి పని చేసుకునే ఆమె ఎల్బీనగర్కు చెందిన రవీంద్రను వివాహం చేసుకుంది. కొద్ది కాలంపాటు అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన హేమ భర్త వేధిసున్నాడంటూ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టింది.
అనంతరం మోతీనగర్, బోరబండ ప్రాంతానికి వచ్చి జగదీష్‌ను రెండో పెళ్లి చేసుకుని అతడిపై కూడా కేసుపెట్టింది. తర్వాత పూర్ణచందర్‌ను మూడోపెళ్లి చేసుకుని అతనిపైనా కేసు పెట్టింది. చివరగా కరీంనగర్‌కు చెందిన కిశోర్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది.ఆ తరువాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్,ఆర్.ఐగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామంది వద్ద నుంచి భారీమొత్తంలో డబ్బులు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు.
చివరగా ఆస్తికోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిత్య పెళ్లి కూతురిని ఫిబ్రవరి 11న ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా ఆమెపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయన్నారు.