నేడు తీర్థవాది ఉత్సవం
కదిరి : ఈ నెల 7న అంకురార్పణతో ప్రారంభమైన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాలు రెండు రోజుల్లో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తీర్థవాది ఉత్సవం సోమవారం భృగుతీర్థం (కోనేరు)లో భక్తుల కోలాహలం మధ్య జరగనుంది. ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు వసంతోత్సవాలు జరుపుకుంటారు. భక్తులు సైతం హోలీ తరహాలో రంగులు చల్లుకొని, ఆనందోత్సాహాలతో వసంతాలు చల్లుకుంటారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవిలతో కలిసి భృగుతీర్థంలోకి వెళ్లి, అక్కడ చక్ర స్నానం ఆచరిస్తారు.
అనంతరం విశేషాలంకరణతో స్వామివారు తిరువీధుల గుండా కాకుండా కోనేరు నుంచి హిందూపురం కూడలి మీదుగా తిరిగి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయం ముందు ధ్వజస్తంభానికి కట్టిన కంకణాలు విప్పేస్తారు. దీంతో తీర్థవాది ఉత్సవం ముగుస్తుంది. అనంతరం శ్రీవారు మధ్యాహ్నం 2 గంటలకు ఆలయంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి స్వామివారు యాగశాలలోనే గడిపారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేస్తారు. అప్పటి నుంచి రోజంతా శ్రీవారి దర్శనం ఉండదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచి స్వామివారు ఆలయంలో యధావిధిగా భక్తులకు దర్శనమిస్తారు.