పానుగోతుతండాలో తీజ్ వేడుకలు
త్రిపురారం : తీజ్ పండుగ గిరిజన సంసృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ నేనావత్ బాలు అన్నారు. మండలంలో అంజనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పానుగోతండాలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న తీజ్ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం కాని గిరిజన యువతులు తండాలో ఎంత మంది ఉంటే అన్ని తీజ్ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహించారు. చివర రోజు తీజ్ బుట్టలను ఎత్తుకుని తండాలోని వీధుల్లో సంప్రదాయ నృత్యాల నడుమ ఊరేగింపు చేశారు. తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చోగా యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవులలో పెట్టారు. అనంతరం తండా సమీపంలోని బావుల్లో కలిపారు. ఈ సందర్భంగా త్రిపురారం ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ బాలు తీజ్ వేడుకల్లో పాల్గొని గిరిజన మహిళలకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తండా పెద్దలు పానుగోతు సేవానాయక్, లాల్సింగ్, సర్థార్నాయక్, చంప్లా, భోజ్యా, వశ్యానాయక్ తదితరులు ఉన్నారు.