thenali
-
ఆంధ్ర ప్యారిస్‌తో అక్కినేనికి అనుబంధం
‘బాలరాజు’గా ‘కీలుగుర్రం’ ఎక్కి.. ‘లైలాను–మజ్నూలా ప్రేమలో ముంచి.. పారూ కోసం ‘దేవదాసు’లా మారి.. ‘అనార్కలి’ కోసం సలీంలో పరకాయ ప్రవేశం చేసి.. ‘మూగ మనసు’తో ముద్ద బంతి పువ్వును మురిపించి.. ‘నవరాత్రి’లో నవరస నటన ప్రదర్శించి.. ‘దసరా బుల్లోడు’గా దుమ్ములేపి.. ‘ప్రేమనగర్’కు ‘మేఘసందేశం’ పంపించి.. అభిమానులకు ‘ప్రేమాభిషేకం’ చేసి.. ‘మనం’ అంతా ఒక్కటే నంటూ మూడు తరాలతో ముచ్చట చేసి దివికేగిన నటసామ్రాట్ అక్కినేని. ఈ అక్కినేనికి అదృష్ట దేవత ఎదురొచ్చి ఆహ్వానించి అద్భుతమైన నటుడిగా నిరూపించుకునే అవకాశం కల్పించింది మన తెనాలి. రేపు అక్కినేని జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తెనాలి : అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవపురంలో ఓ రైతు కుటుంబంలో 1924 సెప్టెంబరు 20న జన్మించారు. నాగేశ్వరరావుకు మూడున్నరేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. పొరుగు ఊరిలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించినా చదువుపై ధ్యాస ఉండేది కాదు. గ్రామాల్లో జరిగే కోలాటాలు, భజన్లు, ఊరేగింపుల్లో పాటలు పాడేవారితో తిరుగుతూ.. అనుకరించేవాడు. ఈ క్రమంలో పాటలు, పద్యాలు వంటపట్టాయి. తొలిసారి ఆరో తరగతిలో స్కూల్ పిల్లలతో కలిసి ‘హరిశ్చంద్ర’ నాటకంలో నారద పాత్ర వేశాడు. – పాఠశాల వార్షికోత్సవంలో చంద్రమతిగా స్త్రీ పాత్రలో నటించాడు. ఇంటి నుంచి ప్రోత్సాహం ఉండటంతో నాటక సమాజాల్లో వేషాలు వేశాడు. అలా స్త్రీ పాత్రల్లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఓ సారి సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు కొనసాగించారు. చిన్న వేషంతో సరిపెట్టి.. నాగేశ్వరరావుకు ధర్మపత్ని సినిమాలో అవకాశం వచ్చినా అందులో పిల్లలంతా కలిసి పాడుకునే పాట సన్నివేశంలోనే వేషం ఇచ్చారు. ఆ తర్వాత ముదినేపల్లిలోని ఎక్సెల్షియర్ క్లబ్ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు ఒక నాటక ప్రదర్శనలో అక్కినేనిని చూసి తన నాటక సమాజానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత క్లబ్లో శాశ్వత ప్రాతిపదికన ‘నాయిక’ పాత్రలకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా మలుపు తిరిగింది.. క్లబ్ ప్రదర్శించిన తెలుగు తల్లి, సత్యాన్వేషణ, ఆశాజ్యోతి నాటకాలు ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలోనే ఇతర జిల్లాల నుంచి నాటక ప్రదర్శనలకు క్లబ్‌కు ఆహ్వానాలు ఎక్కువయ్యాయి. అలా తెనాలి నుంచి ఆహ్వానం రావడంతో తెనాలిలో నాగేశ్వరరావు ఆశాజ్యోతి నాటకంలో స్నేహలత పాత్ర పోషణతో స్థానిక ప్రేక్షకులను మెప్పించారు. తిరుగు ప్రయాణంలోనే అక్కినేనిని అదృష్టం ఎదురొచ్చి స్వాగతించింది. అక్కడి నుంచే ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. తెనాలితో ప్రత్యేక అనుబంధం.. నాటకాల్లో సహనటి అంజలి దంపతులు 1957లో తీసిన సువర్ణసుందరి సినిమా శత దినోత్సవానికి నాగేశ్వరరావు స్థానిక స్వరాజ్ టాకీస్‌కు వచ్చారు. తర్వాత అక్కినేని సినీజీవిత వజ్రోత్సవ వేడుకలను తెనాలిలో వైభవంగా నిర్వహించగా, అక్కినేనిని భారీ ఊరేగింపుతో తీసుకొచ్చి సత్కరించారు. దేవదాసు సినిమా 1980ల్లో విడుదలైనప్పుడు తెనాలిలో 300 రోజులు ఆడటాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు. రైల్వేస్టేషన్లో బుల్లోడు.. తెనాలిలో ఓ ప్రదర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు నాగేశ్వరరావు నాటక బృందం చేరుకుంది. తోటి సభ్యులతో కలిసి రైలు ఎక్కుతున్న నాగేశ్వరరావును అదే రైల్లోని ఫస్ట్‌క్లాస్ ఏసీలో ఉన్న ప్రతిభా సంస్థ ఘంటసాల బలరామయ్య గమనించారు. దగ్గరకు పిలిచి పేరు, ఊరు వివరాలు తెలుసుకుని ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. సీతారామ జననం సినిమాలో శ్రీరాముడు పాత్రధారి కోసం అన్వేషిస్తున్న నిర్మాత బలరామయ్య దృష్టిలో పడిన నాగేశ్వరరావు, ఆయన ఆహ్వానంతో దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి 1944 మే 8న చెన్నైలో అడుగుపెట్టారు. చెప్పినట్టే బలరామయ్య అవకాశమిచ్చి ఆశీర్వదించారు. అప్పటి నుంచి నటనలో వెనుదిరిగి చూడలేదు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. చివరగా ‘మనం’ సినిమాలో కొడుకు, మనుమడితో కలిసి నటించి అక్కినేని మూడు తరాల నటనను వెండి తెరపై పూయించారు. -
పాపకెందుకు శిక్ష ?
శుక్రవారం తెనాలిలో కోర్టు ప్రాంగణం.. ఆరేళ్ల పాప.. ముఖంలో ఆందోళన.. నీళ్లు తిరుగుతున్న కళ్లలో భయం.. ఎటుపోవాలో, ఎవరితో మాట్లాడాలో తెలియదు.. అమ్మ వెళ్లిన వైపే చూస్తోంది. ఎంతకీ అమ్మ కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియ లేదు. కొద్ది గంటల ముందు వరకు నాన్న కళ్ల ముందు అలా మెరిసి మాయమైపోయాడు. నా చిట్టి తల్లీ అంటూ దగ్గరకు తీసుకుంటాడేమోనని ఆశ పడింది. నాన్న దూరంగానే వెళ్లిపోయాడు.. బిక్కముఖం వేసుకుని ఉన్న పాపను నల్ల చొక్కాలు పలకరించి ఆరా తీశాయి.. ‘అమ్మ బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి.. ఇంకా రాలేదు.. అందుకే చూస్తున్నాన’ని పాప బదులిచ్చింది. తల్లి గురించి ఆరా తీస్తే.. భార్యాభర్తల విభేదాల కేసు.. తల్లి తనతో పాపను తీసుకొచ్చింది. తండ్రి కనిపించేసరికి పాపను ఆయన ముందు వదిలేసింది.. విభేదాలు నిండిన గొంతుల్లో మాటలు పెగల్లేదు.. పాప గురించి భర్తకు ఆమె చెప్పలేదు.. చట్టాల ఆంక్షలు చుట్టుకుంటాయనే నెపంతో కన్న బిడ్డ చెంతకు తండ్రి రాలేదు.. నాన్న గుండెలపై మమకారం చిందలేదు. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అందుకే అమ్మ ఆప్యాయతల ఒడిలో మాధుర్యాన్ని, నాన్న గుండెలపై అనురాగాన్ని అందుకోవాల్సిన బిడ్డ అనాథగా రోడ్డుపై నిలబడింది.. విచ్ఛిమవుతున్న కుటుంబ బాంధ్యవాలకు నిలువెత్తు సాక్ష్యంగా.. తెగిపోతున్న మానవసంబంధాల నడుమ పిల్లలు తెగినగాలిపటాలవుతున్నారు. గాలిపటానికిసూత్రం, దారం ఉంటేనే ఆకసాన ఎగిరేది...పిల్లలకు తల్లిదండ్రుల ఆసరా ఉంటేనే ఉన్నతంగాఎదిగేది...నేటి సమాజంలో చిన్నచిన్న వివాదాలతోదాంపత్యబంధాలను తెగతెంపుకొంటున్న తల్లిదండ్రులు...వారి కడుపున పుట్టిన పాపానికి పిల్లల బతుకులు తెగినగాలిపటాల్లా చిందరవందర అవుతున్నాయి. తెనాలి కోర్టు ఆవరణలో శుక్రవారం తారసిల్లినఈ బాలిక ఉదంతం ఇటువంటి లక్షలాదిఅభాగ్యులకో ఉదాహరణ. గుంటూరు, తెనాలి: అది పట్టణంలోని కొత్తపేటలో రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేటు కోర్టు. కక్షిదారులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు/స్నేహితులు, న్యాయవాదులు, సహాయకులతో బిజీగా ఉంది. న్యాయమూర్తి వచ్చేసరికి కోర్టు హాలంతా నిశ్శబ్దంగా తయారైంది. ప్రతిరోజులాగానే యథావిధిగా కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. గంట గడిచేసరికి కక్షిదారుల దగ్గర కూర్చున్న ఆరేళ్ల పాప ఏడవటం ఆరంభించింది. పక్కనున్న మహిళ, ‘ఎవరమ్మా నువ్వు?...మీ అమ్మ లేదా’ అని ప్రశ్నించింది. ‘లేదాంటీ...బాత్రూమ్కు వెళ్లొస్తానంది...ఇంకా రాలేదు’ అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది. పాప ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ మహిళ మంచినీళ్లు, భోజనం పెట్టి ఓదార్చింది. విషయం న్యాయవాదులకు, వారినుంచి న్యాయమూర్తికి తెలిసింది. సాయంత్రానికి ఎవరూ రాకపోతే చట్టప్రకారం చేద్దామని న్యాయమూర్తి సూచించారు. తీరా విచారిస్తే గృహహింస కేసులో వాయిదాలకు తిరుగుతున్న భార్యాభర్తల నిర్లక్ష్యం, ఆ పాపను ఒంటరిని చేసిందని తెలిసి, అక్కడున్న అందరి మనసులు బరువెక్కాయి. దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన లక్ష్మీతిరుపతమ్మ, హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలో చేస్తున్న అమృతలూరు మండలం ప్యాపర్రు వాస్తవ్యుడు వెంకటస్వామికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత మోక్షిత జన్మించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. కొన్నేళ్లు విడిగా ఉన్నారు. మళ్లీ కలిశారు. రెండో కుమార్తె కూడా జన్మించింది. భార్యాభర్తల మధ్య విభేదాలు మాత్రం తగ్గలేదు. ఫలితంగా స్థానిక కోర్టులో గృహహింస కేసు విచారణ జరుగుతోంది. విడివిడిగా ఉంటున్న ఇద్దరూ వాయిదాలకు వస్తున్నారు. పిల్లలిద్దరూ తల్లి లక్ష్మీతిరుపతమ్మ దగ్గరే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం కోర్టు వాయిదాకు వచ్చిన తిరుపతమ్మ, పెద్ద కుమార్తె మోక్షితను వెంట తీసుకొచ్చింది. అదే కోర్టుకు వచ్చిన భర్త వెంకటస్వామిని చూసింది. మోక్షితను అక్కడే కూర్చోబెట్టి, మూత్రవిసర్జనకు వెళ్లొస్తానని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఎంతకీ తల్లి రాకపోవటంతో ఆ బాలిక బిక్కముఖం వేసి ఏడుపు మొదలెట్టింది. అక్కడ ఉన్న న్యాయవాదులు గమనించి మోక్షితను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడించింది. సాయంత్రానికి తల్లిదండ్రులు వేర్వేరుగా కోర్టు వద్దకు చేరుకున్నారు. నవమి పండక్కి నాన్నతో వెళ్లి రెండురోజులు ఉంటానని పాప అంటే, వదిలేశానని తిరుపతమ్మ చెప్పింది. తన వెంట తీసుకెళితే న్యాయపరంగా చిక్కులొస్తాయని లాయరు చెప్పటంతో తాను తీసుకెళ్లలేదని ఆమె భర్త వెంకటస్వామి చెప్పటం గమనార్హం. విచ్ఛిన్నమవుతున్న వివాహ బంధాల నేపథ్యంలో పసిబిడ్డల జీవితాలు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో? చెప్పేందుకు ఈ ఘటనను పలువురు ఉదహరిస్తున్నారు. తండ్రి దగ్గర వదిలేస్తే బిడ్డను తీసుకెళతాడని తల్లి భావించి నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయింది. వెంట తీసుకెళితే కేసులో న్యాయపరంగా ఏదైనా సమస్య వస్తుందేమోనని తండ్రి భయపడి, మానవత్వం లేకుండా వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రికి అప్పగించి వెళ్లొచ్చు కదాని తల్లిని ప్రశ్నిస్తే, మేం మాట్లాడుకోవటం లేదని సమాధానమిచ్చింది. సరే నువ్వు చూశావు కదా ఎందుకు పట్టించుకోలేదని తండ్రిని అడిగితే, ‘ఒకరిని కాదు...ఇద్దరు పిల్లలను తనతోనే తీసుకెళ్లాలని ఉందని, కాని న్యాయపరంగా చిక్కులొస్తాయని’ తీసుకెళ్లలేదని సమాధానమిచ్చాడు. అంతేగానీ, వదిలేస్తే తమ బిడ్డ ఎంతగా తల్లడిల్లుతుందోనని వారిద్దరూ కనీస ఆలోచన చేయలేదని అక్కడివారు మండిపడ్డారు. తెగిపోతున్న వివాహ బంధాల్లో పిల్లల జీవితాలు తెగిన గాలిపటాలవుతున్న ఉదంతాలను ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు బేతాళ ప్రభాకర్, శ్రీనాథ్ రెడ్డి ప్రస్తావించారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి, మరోసారి ఇలా జరక్కుండా చట్టప్రకారం చర్యలు కోరతామని చెప్పారు. -
ప్రియురాలి భర్తపై హత్యాయత్నం
గుంటూరు, తెనాలిరూరల్: వివాహేతర సంబంధానికి ప్రియురాలు ఒప్పుకోకపోవడానికి ఆమె భర్తే కారణమని భావించిన ప్రియుడు అతడిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో భర్త చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణ రజకచెరువు ప్రాంతానికి చెందిన దామిశెట్టి రమేష్ వెండి బంగారు వర్తక సంఘంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్యకు గంగానమ్మపేటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనుతో సుమారు ఐదున్నరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ప్రవర్తనను మార్చుకోవాలని భర్త సూచించడంతో కొంతకాలంగా ఆమె శ్రీనుకు దూరంగా ఉంది. రమేష్ కారణంగా తన ప్రియురాలు దూరంగా ఉంటోందని, అతడి అడ్డు తొలగించాలని భావించిన నిందితుడు శ్రీను శనివారం రాత్రి ఇంటికి వెళుతున్న రమేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాధితుడు రమేష్ ఫిర్యాదును టూ టౌన్ ఎస్ఐ పి. సురేష్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెనాలిలో కన్నెర్రజేసిన రైతులు
తెనాలి: అఖిలపక్ష రైతు సంఘాల పిలుపు మేరకు సోమవారం తెనాలిలో ఆర్డీవో కార్యాలయాన్ని పెద్దసంఖ్యలో రైతులు, కౌలురైతులు ముట్టడించారు. కార్యాలయం గేటు మూసివేసి అడ్డుగా కూర్చున్నారు. మరికొందరు కార్యాలయం ప్రధానద్వారం వద్ద బైఠాయించారు. ఇంకొందరు కార్యాలయం లోపలకు ప్రవేశించి ఉద్యోగుల సీట్ల పక్కనే పడుకున్నారు. రైతుల ఆందోళనతో కొద్దిసేపు మీకోసం కార్యక్రమానికి ఆటంకం కలిగింది. తెల్లజొన్న, మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించిన రైతునాయకులను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రంలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించకుంటే, 26న ఆర్డీవో కార్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమం పెడతామని హెచ్చరించారు. ముట్టడి సమావేశానికి ఏపీ కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదని, బాధ్యత వహించి చివరిగింజ వరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తెల్లజొన్నలకు 2017–18లో క్వింటాలుకు రూ.1725 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయలేదని, మళ్లీ 2018–19కు క్వింటాలుకు రూ.2600 ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర రైతాంగ ఉద్యమస్ఫూర్తితో కదిలితేనే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 145 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూప్రభుత్వం రూ.200 బోనస్ ప్రకటన రైతులను అవమానించేదిగా ఉందన్నారు. ఏపీ కౌలురైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వల్లభనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. రైతాంగ ఆవేదనను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లానని ఆర్డీవో నరసింహులు రైతు ప్రతినిధులతో చెప్పారు. డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రైతుసంఘాల ప్రతినిధులు చెరుకుమల్లి సింగారావు, కొల్లిపర బాబూప్రసాద్, మట్లపూడి థామస్, బొనిగల అగస్టీన్, మేకల చిట్టిబాబు, కావూరి సత్యనారాయణ, మంగళగిరి వెంకటేశ్వర్లు, కంతేటి శ్రీమన్నారాయణ, పి.జోనేష్, ఎన్.రాజ్యలక్ష్మి, నక్కా నాగపార్వతి, దాసరి రమేష్ మాట్లాడారు. -
బతికి వస్తాననుకోలేదు
తిండీ తిప్పలు లేవు. ఇంటికి ఫోన్ చేసే అవకాశం లేదు. పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. చివరకు అక్కడకు పంపిన ఏజెంట్‌తో సంబంధాలు తెగిపోయాయి. యుద్ధవాతావరణంలో బాంబుల మోత నడుమ తిరిగి ఇంటికి చేరతామా, ప్రాణాలతో ఉంటామా, అని భయాందోళనకు లోనవుతున్న తరుణంలో భారత్ ఎంబసీ స్పందించటం..బతుకుజీవుడా అంటూ బయటపడడం నిజంగా కలగానే ఉంది.తెనాలి రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఈదులమూడి శశిదీప్ ఇరాక్ నుంచి క్షేమంగా ఇల్లు చేరిన సందర్భంగా మాట్లాడిన మాటలివి. ఇరాక్ నుంచి క్షేమంగా బయటపడిన ఈదులమూడి శశిదీప్ తెనాలిఅర్బన్ : పొట్టకూటి కోసం ఏజెంట్ మాటలు నమ్మి మార్చి ఏడున శశిదీప్, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన చెందిన ఎస్కే బాషా, లక్ష్మణ్‌లతో కలిసి ఇరాక్ వెళ్లాడు. అక్కడ కోఫియా ప్రాంతంలోని ఓ కూల్‌డ్రింక్ కంపెనీలో పనికి కుదిరాడు. నాలుగో నెల గడుస్తుండగా, ఇరాక్ ప్రభుత్వానికీ, అక్కడున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ ముందే బాంబు పేలుళ్లు, కాల్పులు జరగటంతో కంపెనీ యాజమాన్యం వీరిని పట్టించుకోకుండా పారిపోయింది. దాదాపు నాలుగు రోజులు నరకయాతన అనుభవించిన తరువాత భారత్‌కు సమాచారం అందింది. మన ఎంబసీ ప్రతినిధులు స్పందించి ఈ ముగ్గురూ బయటపడేందుకు సహకరించారు. అష్టకష్టాలు పడిన శశిదీప్ మంగళవారం రాత్రి కఠెవరం గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులను కలుసుకుని కంటతడి పెట్టుకున్నాడు. బతుకుతామని, తిరిగి కుటుంబ సభ్యులను కలుస్తామని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. యుద్ధ వాతావారణం నెలకొన్న తరువాత దాదాపు పదిరోజులు తిండి లేక, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే వీల్లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికినట్టు శశిదీప్ చెప్పాడు. నెలల కాలానికి రెండు నెలల వేతనం మాత్రమే దక్కిందని వాపోయాడు. దాదాపు రూ. లక్షన్నర అప్పుచేసి ఉపాధి కోసం వెళితే, అప్పులే మిగిలాయని, తనలాంటి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. శశిదీప్తోపాటు వెళ్లిన ఎస్.కె. బాషా, లక్ష్మణ్‌లు కూడా క్షేమంగా ఇల్లు చేరుకున్నారు.