శుక్రవారం తెనాలిలో కోర్టు ప్రాంగణం.. ఆరేళ్ల పాప.. ముఖంలో ఆందోళన.. నీళ్లు తిరుగుతున్న కళ్లలో భయం.. ఎటుపోవాలో, ఎవరితో మాట్లాడాలో తెలియదు.. అమ్మ వెళ్లిన వైపే చూస్తోంది. ఎంతకీ అమ్మ కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియ లేదు. కొద్ది గంటల ముందు వరకు నాన్న కళ్ల ముందు అలా మెరిసి మాయమైపోయాడు. నా చిట్టి తల్లీ అంటూ దగ్గరకు తీసుకుంటాడేమోనని ఆశ పడింది. నాన్న దూరంగానే వెళ్లిపోయాడు.. బిక్కముఖం వేసుకుని ఉన్న పాపను నల్ల చొక్కాలు పలకరించి ఆరా తీశాయి.. ‘అమ్మ బాత్రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి.. ఇంకా రాలేదు.. అందుకే చూస్తున్నాన’ని పాప బదులిచ్చింది. తల్లి గురించి ఆరా తీస్తే.. భార్యాభర్తల విభేదాల కేసు.. తల్లి తనతో పాపను తీసుకొచ్చింది. తండ్రి కనిపించేసరికి పాపను ఆయన ముందు వదిలేసింది.. విభేదాలు నిండిన గొంతుల్లో మాటలు పెగల్లేదు.. పాప గురించి భర్తకు ఆమె చెప్పలేదు.. చట్టాల ఆంక్షలు చుట్టుకుంటాయనే నెపంతో కన్న బిడ్డ చెంతకు తండ్రి రాలేదు.. నాన్న గుండెలపై మమకారం చిందలేదు. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అందుకే అమ్మ ఆప్యాయతల ఒడిలో మాధుర్యాన్ని, నాన్న గుండెలపై అనురాగాన్ని అందుకోవాల్సిన బిడ్డ అనాథగా రోడ్డుపై నిలబడింది.. విచ్ఛిమవుతున్న కుటుంబ బాంధ్యవాలకు నిలువెత్తు సాక్ష్యంగా..
తెగిపోతున్న మానవసంబంధాల నడుమ పిల్లలు తెగినగాలిపటాలవుతున్నారు. గాలిపటానికిసూత్రం, దారం ఉంటేనే ఆకసాన ఎగిరేది...పిల్లలకు తల్లిదండ్రుల ఆసరా ఉంటేనే ఉన్నతంగాఎదిగేది...నేటి సమాజంలో చిన్నచిన్న వివాదాలతోదాంపత్యబంధాలను తెగతెంపుకొంటున్న తల్లిదండ్రులు...వారి కడుపున పుట్టిన పాపానికి పిల్లల బతుకులు తెగినగాలిపటాల్లా చిందరవందర అవుతున్నాయి. తెనాలి
కోర్టు ఆవరణలో శుక్రవారం తారసిల్లినఈ బాలిక ఉదంతం ఇటువంటి లక్షలాదిఅభాగ్యులకో ఉదాహరణ.
గుంటూరు, తెనాలి: అది పట్టణంలోని కొత్తపేటలో రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేటు కోర్టు. కక్షిదారులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు/స్నేహితులు, న్యాయవాదులు, సహాయకులతో బిజీగా ఉంది. న్యాయమూర్తి వచ్చేసరికి కోర్టు హాలంతా నిశ్శబ్దంగా తయారైంది. ప్రతిరోజులాగానే యథావిధిగా కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. గంట గడిచేసరికి కక్షిదారుల దగ్గర కూర్చున్న ఆరేళ్ల పాప ఏడవటం ఆరంభించింది. పక్కనున్న మహిళ, ‘ఎవరమ్మా నువ్వు?...మీ అమ్మ లేదా’ అని ప్రశ్నించింది. ‘లేదాంటీ...బాత్‌రూమ్‌కు వెళ్లొస్తానంది...ఇంకా రాలేదు’ అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది. పాప ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ మహిళ మంచినీళ్లు, భోజనం పెట్టి ఓదార్చింది. విషయం న్యాయవాదులకు, వారినుంచి న్యాయమూర్తికి తెలిసింది. సాయంత్రానికి ఎవరూ రాకపోతే చట్టప్రకారం చేద్దామని న్యాయమూర్తి సూచించారు. తీరా విచారిస్తే గృహహింస కేసులో వాయిదాలకు తిరుగుతున్న భార్యాభర్తల నిర్లక్ష్యం, ఆ పాపను ఒంటరిని చేసిందని తెలిసి, అక్కడున్న అందరి మనసులు బరువెక్కాయి.
దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన లక్ష్మీతిరుపతమ్మ, హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలో చేస్తున్న అమృతలూరు మండలం ప్యాపర్రు వాస్తవ్యుడు వెంకటస్వామికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత మోక్షిత జన్మించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. కొన్నేళ్లు విడిగా ఉన్నారు. మళ్లీ కలిశారు. రెండో కుమార్తె కూడా జన్మించింది. భార్యాభర్తల మధ్య విభేదాలు మాత్రం తగ్గలేదు. ఫలితంగా స్థానిక కోర్టులో గృహహింస కేసు విచారణ జరుగుతోంది. విడివిడిగా ఉంటున్న ఇద్దరూ వాయిదాలకు వస్తున్నారు. పిల్లలిద్దరూ తల్లి లక్ష్మీతిరుపతమ్మ దగ్గరే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం కోర్టు వాయిదాకు వచ్చిన తిరుపతమ్మ, పెద్ద కుమార్తె మోక్షితను వెంట తీసుకొచ్చింది. అదే కోర్టుకు వచ్చిన భర్త వెంకటస్వామిని చూసింది. మోక్షితను అక్కడే కూర్చోబెట్టి, మూత్రవిసర్జనకు వెళ్లొస్తానని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఎంతకీ తల్లి రాకపోవటంతో ఆ బాలిక బిక్కముఖం వేసి ఏడుపు మొదలెట్టింది. అక్కడ ఉన్న న్యాయవాదులు గమనించి మోక్షితను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడించింది. సాయంత్రానికి తల్లిదండ్రులు వేర్వేరుగా కోర్టు వద్దకు చేరుకున్నారు. నవమి పండక్కి నాన్నతో వెళ్లి రెండురోజులు ఉంటానని పాప అంటే, వదిలేశానని తిరుపతమ్మ చెప్పింది. తన వెంట తీసుకెళితే న్యాయపరంగా చిక్కులొస్తాయని లాయరు చెప్పటంతో తాను తీసుకెళ్లలేదని ఆమె భర్త వెంకటస్వామి చెప్పటం గమనార్హం.
విచ్ఛిన్నమవుతున్న వివాహ బంధాల నేపథ్యంలో పసిబిడ్డల జీవితాలు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో? చెప్పేందుకు ఈ ఘటనను పలువురు ఉదహరిస్తున్నారు. తండ్రి దగ్గర వదిలేస్తే బిడ్డను తీసుకెళతాడని తల్లి భావించి నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయింది. వెంట తీసుకెళితే కేసులో న్యాయపరంగా ఏదైనా సమస్య వస్తుందేమోనని తండ్రి భయపడి, మానవత్వం లేకుండా వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రికి అప్పగించి వెళ్లొచ్చు కదాని తల్లిని ప్రశ్నిస్తే, మేం మాట్లాడుకోవటం లేదని సమాధానమిచ్చింది. సరే నువ్వు చూశావు కదా ఎందుకు పట్టించుకోలేదని తండ్రిని అడిగితే, ‘ఒకరిని కాదు...ఇద్దరు పిల్లలను తనతోనే తీసుకెళ్లాలని ఉందని, కాని న్యాయపరంగా చిక్కులొస్తాయని’ తీసుకెళ్లలేదని సమాధానమిచ్చాడు.
అంతేగానీ, వదిలేస్తే తమ బిడ్డ ఎంతగా తల్లడిల్లుతుందోనని వారిద్దరూ కనీస ఆలోచన చేయలేదని అక్కడివారు మండిపడ్డారు. తెగిపోతున్న వివాహ బంధాల్లో పిల్లల జీవితాలు తెగిన గాలిపటాలవుతున్న ఉదంతాలను ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు బేతాళ ప్రభాకర్, శ్రీనాథ్ రెడ్డి ప్రస్తావించారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి, మరోసారి ఇలా జరక్కుండా చట్టప్రకారం చర్యలు కోరతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment