రాష్ట్రానికి ‘కేంద్ర’ విద్యుత్ 85 శాతమే
- పునర్విభజన చట్టంలోని ‘4 వేల మెగావాట్ల’ హామీకి చిల్లు
- రామగుండం విద్యుత్‌పై ఈఆర్సీ బహిరంగ విచారణలో ఎన్టీపీసీ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు’ నుంచి రాష్ట్రానికి 85 శాతం(3400మెగావాట్ల) విద్యుత్ కేటాయింపులే ఉన్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) వెల్లడించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన 15 శాతం విద్యుత్‌ను ఎవరికి కేటాయించాలన్న అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికీ కేటాయించని పక్షంలో అది రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉం దని పేర్కొంది. తొలిదశలో నిర్మిస్తున్న 1600(2‘800) మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఎన్టీపీసీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం ఇక్కడ బహిరంగ విచారణ నిర్వహించింది. విచారణలో పాల్గొన్న ఎన్టీపీసీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున పూర్తిగా 4వేల మెగావాట్లను రాష్ట్రానికే కేటాయించాలని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ కోరగా ఎన్టీపీసీ తరఫున ఏజీఎం సుదర్శన్ పైవిధంగా బదులిచ్చారు. పెరుగుతున్న ఎన్టీపీసీ విద్యుత్ ధరలపై ఈఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విద్యుత్ ధరలను సూచనాప్రాయంగానైనా తెలిపే అవకాశం ఉందా అని ఎన్టీపీసీని ప్రశ్నించింది. ఎన్టీపీసీ విద్యుత్ ధరలను సీఈఆర్సీ నిర్ణయిస్తుందని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేయడంలో విఫలమైతే వర్తింపజేసే పెనాల్టీని విద్యుత్‌ను సరఫరా చేయడంలో ఎన్టీపీసీ విఫలమైనా వర్తింపజేయాలని ఈఆర్సీ విజ్ఞప్తి చేసింది.
పీపీఏకు సవరణలు తప్పనిసరి..
బహిరంగ విచారణలో చర్చకు వచ్చిన అంశాలపై పీపీఏకు సవరణలు చేయాల్సిందేనని ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. మార్పులను సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, నాలుగు వారాల్లో ఆ మేర సవరణలు పూర్తి చేయాలన్నారు.
బై-అవుట్ నిబంధన పెట్టాలి
‘ఒప్పంద కాలం 25 ఏళ్లలో పెట్టుబడి వ్యయం కంటే కొన్ని రేట్లు అధిక రాబడిని ఎన్టీపీసీ సంపాదించనుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును తెలంగాణ డిస్కంలు బై-అవుట్ చేసుకునేలా పీపీఏలో నిబంధన పెట్టాల’ని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు సూచించారు.