రండి రండి రండి థాయ్ ఫుడ్డండీ!!
థాయ్‌లాండ్‌లో ఒక సంప్రదాయం ఉంది.
ఇంట్లోగానీ, రెస్టారెంట్‌లోగానీ...
ఎవరూ ఒక్కరే తింటూ కనిపించరు!
ఎవరూ ఒక్క ఐటమ్తోనే సరిపెట్టుకోరు!
ఎవరూ అతిథి ఓకే అనకుండా మొదలుపెట్టరు!
ఎవరూ హడావుడిగా మింగేయరు!
ఎవరూ మాట్లాడకుండా తినరు!
ఎవరూ ప్లేట్లో కాస్త కూడా మిగల్చరు!
అంటే ఏమిటర్థం?
ప్రతి భోజనమూ అక్కడ వనభోజనమే!
ఇంత మంచి సంప్రదాయం ఎలా వచ్చింది?
‘‘అది మా ఫుడ్‌లోనే ఉంది’’ అంటారు వాళ్లు!
ఫుడ్లోనా!! అయితే... ఓ పట్టు పట్టాల్సిందే.
ఫ్రెండ్స్‌ని బుట్టలో వేసుకోవాల్సిందే!
థాయీ గ్రీన్ కర్రీ
కావలసినవి: పచ్చిమిర్చి - 2, ఉల్లితరుగు - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, నారింజకాయ - ఒకటి (చిన్నది), పంచదార - 2 టేబుల్ స్పూన్లు, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - 2 రెమ్మలు, ఏలకులు - 2, జీలకర్ర - టీ స్పూను, వీటన్నిటినీ పేస్ట్ చేసి, కొబ్బరిపాలు పోసి మరిగించాక, కూరముక్కలు జత చేసి మరోమారు ఉడికించి పక్కన ఉంచాలి.
కావలసినవి: గ్రీన్ కర్రీ పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు (సూపర్మార్కెట్లో దొరుకుతుంది), కొబ్బరిపాలు - 2 కప్పులు, నీరు - అర కప్పు, చైనీస్ క్యాబేజీ తరుగు - 2 కప్పులు, రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, క్యారట్ తురుము - కప్పు, మష్రూమ్స్ - కప్పు, బేబీకార్న్ తరుగు - అర కప్పు, పనీర్ - అర కప్పు
తయారి స్టౌ మీద బాణలి ఉంచి అందులో గ్రీన్ కర్రీ పేస్ట్, కొబ్బరిపాలు వేసి, ఆపకుండా కలుపుతూ మరిగించి, మంట తగ్గించి 5 నిముషాలు ఉంచాలి
పైన చెప్పిన మిగతా పదార్థాలను వేసి, మంట తగ్గించి నాలుగు నిముషాలు ఉంచి దించేయాలి
(కూరముక్కలన్నీ ఉడకాలి కాని ముద్ద అయిపోకూడదు. ఒకవేళ గ్రీన్ కర్రీ బాగా స్పైసీగా ఉందనిపిస్తే, మరికొన్ని కొబ్బరిపాలు జత చేయవచ్చు)
రైస్‌తో సర్వ్ చేయాలి.
థాయీ ట్రాపియోకా పెరల్ డంప్లింగ్స్
కావలసినవి:
సగ్గుబియ్యం - కప్పు (సన్నవి), వేడినీరు - ఒకకప్పు కంటె ఎక్కువ, క్రంబుల్స్ - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి), బాదంపప్పులు - పావు కప్పు ఉల్లితరుగు - టేబుల్ స్పూను, అల్లంతరుగు - టేబుల్ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ - టేబుల్‌స్పూను, నువ్వుల నూనె - టీ స్పూను
తయారి
బాణలిలో నూనె వేసి కాగాక, ఉల్లితరుగు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేసి వేయించాలి క్రంబుల్స్, పల్లీలు, సోయాసాస్ వేసి క్రంబుల్స్ మెత్తగా ఉడికేవరకు కలుపుతుండాలి
కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టౌ ఆర్పేయాలి
సన్న సగ్గుబియ్యాన్ని ఒక పాత్రలో వేసి, వేడి నీరు పోసి, ముద్దగా అయ్యేలా కలపాలి. (ఎండినట్టుగా ఉండకుండా చూసుకోవాలి)
ఒక పాత్రలో నీరుపోసి, నీటిలో చేతివేళ్లను ముంచి, సగ్గుబియ్యం మిశ్రమం కొద్దిగా తీసుకుని, ఒత్తి, అందులో క్రంబుల్ మిక్స్చర్ను కొద్దిగా ఉంచి, చివర్లు మూసి బాల్లా తయారు చేయాలి
ఈ బాల్స్‌ను ఇడ్లీ రేకులలో ఉంచి (ఒకదానికి ఒకటి తగలకుండా చూసుకోవాలి) వాటిని కుకర్‌లో ఉంచి, విజిల్ పెట్టకుండా ఇడ్లీల మాదిరి సుమారు 30 నిముషాలు ఉడికించి దించేయాలి
పాత్రలో నుంచి వీటిని బయటకు తీస్తున్నప్పుడు ఒక్కో బాల్ మీద కొద్దిగా నువ్వులనూనె చల్లాలి.
థాయీ ఫ్రైడ్ రైస్
కావలసినవి:
బాస్మతి బియ్యం - 3 కప్పులు, బీన్స్ - 20, థాయీ రెడ్ కర్రీ పేస్ట్ - టేబుల్ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), నీరు - 6 కప్పులు, ఉప్పు - తగినంత, సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, వెజిటబుల్ ఆయిల్ - టేబుల్ స్పూను, ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి), రెడ్కర్రీ పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), వెల్లుల్లి రేకలు - 3 (వేయించాలి), వేయించిన పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (కొద్దిగా పలుకులుగా ఉండేలా పొడి చేయాలి), కొత్తిమీర, పుదీనా ఆకులు - అర కప్పు (సన్నగా కట్ చేయాలి)
తయారి బీన్స్‌ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో నీరు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి బీన్స్ జత చేసి రెండు నిముషాలు ఉడికి ంచి, ముక్కలను చల్లటి నీరు ఉన్న పాత్రలో వేయాలి. (ఇలా చేయడం వలన బీన్స్ మరీ మెత్తబడిపోకుండా ఉంటాయి) చిన్న పాత్రలో రెడ్ కర్రీ పేస్ట్, సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు నీరు వేసి పేస్ట్‌లా చేసి, పక్కన ఉంచుకోవాలి
ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయాలి
ఉల్లితరుగు జత చేసి బంగారురంగులోకి వచ్చే వరకు వేయించాలి
రెడ్ క్యాప్సికమ్ తరుగు జత చేసి ఒక నిముషం పాటు కలపాలి
బీన్స్ ముక్కలు, రెడ్ కర్రీ పేస్ట్ జత చేసి మంట పెంచి సుమారు 30 సెకన్లు ఉంచి దించేయాలి
ఈ మిశ్రమానికి అన్నం జత చేసి అన్నీ కలిసేలా జాగ్రత్తగా కలపాలి
పల్లీలపొడి, వేయించి ఉంచుకున్న వెల్లుల్లి రేకలు, సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి.
వెజిటబుల్ థాయీ ప్యాడ్
కావలసినవి
సాస్ కోసం: బ్రౌన్ షుగర్ - 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - 4 టేబుల్ స్పూన్లు, నీరు - పావు కప్పు
నూడుల్స్ కోసం: థాయ్ రైస్ నూడుల్స్ - ఒక ప్యాకెట్, వెజిటబుల్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికమ్- 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రేకలు - 6, బ్రొకోలీ ముక్కలు - 2 కప్పులు, క్యారట్ తురుము - కప్పు, పనీర్ - కప్పు, బీన్స్ గింజలు - గుప్పెడు, ఉల్లికాడల తరుగు - పావు కప్పు, వేయించిన పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, నిమ్మ ముక్కలు - 6
తయారి:
సాస్‌కు ఉపయోగించే పదార్థాలను ఒక నాన్‌స్టిక్ పాన్‌లో వేసి, ఉడికించాలి దించేయాలి
నూడుల్స్‌ను నానబెట్టి, నీటిని వడకట్టాలి. (ప్యాకింగ్ మీద ఇచ్చిన సూత్రాలను పాటించాలి. ఎటువంటి సూచనలు ఇవ్వకపోతే, చల్లటి నీటిలో సుమారు పావుగంట సేపు నానబెట్టి, ఆ తరవాత వడకట్టాలి)
బాణలిలో నూనె వేసి కాగాక, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి
వెల్లుల్లి తరుగు, బ్రకోలీ ముక్కలు, క్యారట్ తురుము జత చేసి, మీడియం మంట మీద వీటిని కలుపుతూ, బ్రకోలీ ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి, వెల్లుల్లి వాసన రావడం ప్రారంభించాక రెండు నిముషాలు ఉంచి దించేయాలి
నానబెట్టిన నూడుల్స్, పనీర్, సాస్‌లను జత చేసి, అన్నీ బాగా కలిసి, నూడుల్స్ ఉడికేవరకు మీడియం మంట మీద ఉంచాలి. (ముద్దలా అయిపోకుండా చూసుకోవాలి)
మంట ఆపేసి, బీన్స్ గింజలు, ఉల్లికాడల తరుగు వేసి బాగా కలపాలి
కొత్తిమీర తరుగు, పల్లీలతో గార్నిష్ చేసి, నిమ్మ ముక్కలు జత చేసి సర్వ్ చేయాలి.
సోయా కర్ల్స్
కావలసినవి:
సోయా కర్ల్స్ - ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను, బ్రొకోలీ - నాలుగైదు ముక్కలు, ఉప్పు - తగినంత, అల్లం పేస్ట్ - టీ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను.
గ్రేవీ కోసం... సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టేబుల్ స్పూన్లు, నువ్వులనూనె - టేబుల్ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను, కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారి
సోయా కర్ల్స్ను వేడినీటిలో సుమారు 20 నిముషాలు నాననిచ్చి, నీరంతా పిండేయాలి
ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలిపి, అందులో సోయా కర్ల్స్ను వేసి కలపాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, సోయా కర్ల్స్ వేసి, బంగారురంగులోకి వచ్చేవరకు (చిన్న మంట మీద) వేయించి, తీసి పక్కన ఉంచాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రొకోలీ వేసి బాగా వేయించాలి
సోయా కర్ల్స్ జత చేయాలి
సాస్ కోసం ఉన్న పదార్థాలన్నిటినీ జత చేసి సాస్ పూర్తిగా ఆవిరయ్యేవరకు స్టౌ మీద ఉంచాలి
నువ్వులు, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసి, రైస్ నూడుల్స్‌తో సర్వ్ చేయాలి.
సేకరణ: డా.వైజయంతి
కర్టెసీ: veggiebelly.com