పెద్దగా ఆలోచించాలి!
మన ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉంటే.. అభివృద్ధి కూడా అదే స్థాయిలోనే ఉంటుందని చాలామంది అంటుంటారు. అమలా పాల్ కూడా అదే అంటున్నారు. అందుకే ‘థింక్ బిగ్ స్టూడియోస్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు. ‘నాన్న’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన అమలాపాల్ ఏడాది క్రితం తమిళ దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తమాభిరుచి గల చిత్రాలను అందించాలనే సంకల్పంతో ఈ భార్యాభర్తలు ఇప్పుడు నిర్మాతలుగా మారారు. తొలి ప్రయత్నంగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, శ్రీయారెడ్డి కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. దీనికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నామనీ, అంతర్జాతీయ ప్రేక్షకులకు నచ్చే చిత్రం తీయాలనే పెద్ద ఆశయంతో ఈ సినిమా మొదలుపెట్టామనీ అమలాపాల్ విజయ్ తెలిపారు.