హాలీవుడ్‌లోనూ పాటలు పెడుతున్నా!
భారతీయ సినిమాల్లో పాటలు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు పెద్ద కొరతగా భావిస్తారు. హలీవుడ్ చిత్రాలు ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పాటలుండే సినిమాలు అరుదు. కానీ, హాలీవుడ్ చిత్రాల్లోనూ పాటలుంటే బాగుంటుందని సంగీత సంచలనం ఎ.ఆర్. రెహమాన్ అంటున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రం కోసం జంట ఆస్కార్ అవార్డులు అందుకుని, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకున్న రెహమాన్ ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలకూ సంగీతదర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
సినిమాల్లో పాటలకు ఉండే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ చిత్రాలకు కూడా పాటలు స్వరపరుస్తున్నారు రెహమాన్. దీని గురించి ఆయన చెబుతూ -‘‘పాటలు లేకుండా సినిమా తీయాలనుకుంటారు కొంతమంది. కానీ, సినిమాల్లో ప్రేక్షకులకు హాయినిచ్చే అంశాల్లో ఆటాపాటా ఒకటి. కేవలం వాటి కోసమే మళ్లీ మళ్లీ సినిమాలు చూసేవాళ్లున్నారు. అందుకే, నేను హాలీవుడ్ చిత్రాల్లో కూడా పాటలు పెడుతున్నా. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాల్లో ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే సినిమా ఒకటి.
క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ కథ అటు అమెరికాలోనూ ఇటు ఇండియాలోనూ సాగుతుంది. ఎక్కువ శాతం షూటింగ్ ఇండియాలో చేశారు. రెండు దేశాల నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, దీన్ని నేను సవాల్‌గా తీసుకుని చేశాను ఈ సినిమాలో పాటలున్నాయి. తమిళంలో నేను పాటలు స్వరపరచిన ‘తిరక్కద కాట్టుకుళ్లే’ అనే సినిమాలోని ఓ పాటను ఈ హాలీవుడ్ చిత్రంలో వాడాను. అలా వాడటం నాకిష్టం లేకపోయినా చిత్రదర్శక, నిర్మాతలకు ఆ ట్యూన్ బాగా నచ్చింది. వాళ్ల కోరిక మేరకు ఈ ట్యూన్ తీసుకున్నా’’ అని చెప్పారు.