కేవీల్లో జర్మన్ స్థానంలో సంస్కృతం
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలల్లో తృతీయ భాషగా జర్మన్ స్థానంలో ఇకపై సంస్కృతాన్ని బోధించనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. జాతీయ అవసరాల దృష్ట్యా కేవీల గవర్నర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఇది సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్నది కాదని, విద్యార్థుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించినదని అన్నారు.
కేవీల్లో తృతీయ భాషగా జర్మన్‌ను బోధించడంపై 2011లో కుదిరిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. జాతీయ విద్యావిధానంలో ‘త్రి భాషా పద్ధతి’కి వ్యతిరేకంగా ఉన్న ఆ ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారని కేవీ బోర్డు సమావేశంలో ప్రశ్నించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ఉన్న దాదాపు 68 వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది.