బంగ్లాదేశ్‌కు అంతరిక్ష రంగంలో భారత్ సహకారం
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మూడో సంయుక్త సంప్రదింపుల కమిటీ(జేసీసీ) సమావేశం శనివారమిక్కడ ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మంత్రులు సుష్మా స్వరాజ్, అబుల్ హసన్ మహమూద్ అలీలు పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో... బంగ్లాదేశ్‌కు పౌర అణు, అంతరిక్ష రంగాల్లో నైపుణ్యాన్ని అందజేసేందుకు భారత్ అంగీకరించింది. 2014 చివరి నాటికి ఢాకా-షిల్లాంగ్ బస్ సర్వీసు ట్రయల్ రన్‌ను చేపట్టాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఇరుదేశాల్లో దౌత్యపరమైన ప్రాతినిధ్యాలను పెంచేందుకు మంత్రులిద్దరూ అంగీకరించారు. అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న సరిహద్దు జిల్లాల కలెక్టర్ల సమావేశాలను ఒకసారి భారత్‌లో, మరోసారి బంగ్లాదేశ్‌లో విడతలవారీగా నిర్వహించాలన్న ప్రతిపాదననూ మంత్రుద్దరూ స్వాగతించారు.