'ఆపరేషన్ బ్లూ స్టార్'కు 32 ఏళ్లు
అమృత్ సర్: సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 32 ఏళ్లు. ఈ సందర్భంగా సోమవారం గోల్డెన్ టెంపుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కొన్ని సిక్కు రాడికల్ గ్రూపులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ మక్కార్ లు ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం,ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ ఏఎస్ చహల్ తెలిపారు. సిక్కు ఆలయంలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984 సైనిక చర్యకు ఆదేశించారు.
భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కుల ఊచకోత గురించిన కేసు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలను వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. కాగా సిక్కు అంగరక్షకుల చేతిలో ఇందిరాగాంధీ మరణించారు.