మీడియాను అభినందించిన హైకోర్టు
చెన్నై: దంపతులపై తమిళనాడు పోలీసుల దౌర్జన్యంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న దంపతులను మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. పోలీసుల దౌర్జన్యకాండను వెలుగులోకి తెచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఉన్నత న్యాయస్థానం అభినందించింది. తనపై దౌర్జన్యం చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
తిరువణ్ణామలై జిల్లా సెంగం పట్టణంలో దంపతులు, వారి కుమారుడిపై సోమవారం మధ్యాహ్నం పోలీసులు లాఠీలతో దారుణం కొట్టారు. తేకవాడియ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజ, భార్య ఉష, కుమారుడు సూర్య బంగారం కొనేందుకు సెంగంలోని బంగారు దుకాణానికి వెళ్ళారు. బంగారం కొనే సమయంలో భార్యభర్తల మధ్య గొడవ తలెత్తింది. సెంగం పోలీసులు నమ్ఆల్వార్, మురుగన్, విజయకుమార్ అనే ముగ్గురు వచ్చి రాజ, భార్య ఉష వద్దకు వచ్చి నడి రోడ్డులో ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించారు.
ఇది తమ కుటుంబ వ్యవహారమని, మధ్య రావొద్దని అనడంతో కోపంతో రగిలిపోయిన ఖాకీలు రాజ, ఉష్, సూర్యలను విచక్షణారహితంగా కొట్టారు. రాజ, సూర్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాజ బందువులు, స్థానికులు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. దౌర్జన్యం చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.