శ్రీమంతుడు... నానాపటేకర్
సాక్షి, ముంబై: కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుకు తనవంతుగా కృషి చేస్తున్న బాలీవుడ్ నటుడు నానాపటేకర్.. మరో అడుగు ముందుకేశారు. మరో నటుడు మకరంద్ అనాస్పురేతో కలసి స్థాపించిన ‘నామ్’ సంస్థ తరఫున ఔరంగాబాద్ జిల్లాలోని థోందలాగావ్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహాత్మా గాంధీ జయం తి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గ్రామసభలో నానా పటేకర్, మకరంద్ ఈ విషయాన్ని ప్రకటించారు.
మరాఠ్వాడలో నెలకొన్న కరువు పరిస్థితులపై వీరిద్దరు చొరవ తీసుకుని రైతులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరికొందరు బాలీవుడ్, మరాఠీ చలనచిత్ర పరిశ్రమకు చెంది న వారు కూడా రైతులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలసి స్థాపించిన నామ్ సంస్థ మరాఠ్వాడలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి మరో అడుగు ముందుకేసింది.
రాబోయే రోజు ల్లో కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో రైతులకు సూచనలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే జల వనరులతోపాటు రైతుల కోసం కొన్ని ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నారు. రైతులతో భేటీ అవుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. నామ్ సంస్థకు మద్దతు తెలిపే వారి సంఖ్య పెరగడంతోపాటు వీరు తోడ్పాటు అందించే రైతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలిపారు.