వుడా స్థానంలో వీఎండీఎ
వచ్చే నెల నుంచి కార్యకలాపాలు
100 గజాల్లోపు ఆక్రమిత పేదలకు ఇళ్ల పట్టాలు
వచ్చే నెలలో రేషన్‌కార్డుల జారీ
సకాలంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి
జిల్లా అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష
విశాఖపట్నం : వుడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (వీఎండీఎ) వచ్చే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనికి సీఎం చైర్మన్‌గా ఉండబోతున్నారు. ప్రతీ నెలా పెండింగ్ ప్రాజెక్టులను సీఎం స్వయంగా సమీక్షించనున్నారు. ప్రాజెక్టులనుసైతం నిర్ధేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో పెండింగ్ సమస్యలు..స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. వివరాలను మంత్రి అయ్యన్న మీడియాకు వివరించారు.
వంద గజాల్లోపు స్థలంలో ఉంటున్న ఆక్రమిత నిరుపేదలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. స్వాతం త్ర వేడుకల సందర్భంగా 15న సీఎం అధికారికంగా ప్రకటిస్తారు. నగరంలో 80 వేల మంది వరకు ఉన్నట్టుగా అంచనా. అభ్యంతరాలు లేని ప్రాంతాలకు చెందిన 17వేలమందికి మాత్రమే తొలివిడత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు.అర్హులైన దరఖాస్తుదారులకు వచ్చే నెలలో రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందుగా రేషన్‌కార్డులివ్వాలని సూచించారు.
జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల కోసం వెయ్యిఎకరాల భూములవసరమవుతాయని..వాటిని నిర్ధేశిత కాలపరిమితిలో సేకరించాలని సూచించారు. విశాఖ-భీమిలి మధ్య నాలుగులైన్ల రహదారిని నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.సాగర తీరంలోస్విమ్మింగ్ జోన్స్ గుర్తించి అభివృది ్ధచేయాలని సూచించారు.లంబసింగ్, అల్లూరి సీతామరాజు సమాధి, అరకు ప్రాంతాలను యనిట్గా తీసుకుని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తారు. లంబసింగిలో బొటానికల్ గార్డెన్, రోజ్గార్డెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.విశాఖలో మెగా ఆడిటోరియం నిర్మించేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి, గాదె శ్రీనివాసుల నాయుడు, జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని, అర్బన్,రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టారు. మధ్యాహ్నం వరకు మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిలు సీఎం పర్యటనలో పాల్గొన్నప్పటికీ సమీక్షలో మాత్రం కన్పించలేదు.