చిన్నారి ఆలోచనకు అత్యున్నత పురస్కారం!
చుట్టూ మురికివాడలు. ఎటు చూసినా పేదరికం. అయినా తొమ్మిదేళ్ల ముస్కాన్ అహిర్వార్ వెనుకంజ వేయలేదు. తన ఆలోచనే ఆలంబనగా చేసుకొని మురికివాడల్లోని తనలాంటి పిల్లలకు చదువు చెప్పేందుకు కృషి చేసింది. తన దగ్గర ఉన్న పుస్తకాలతో భోపాల్ నగరంలోని మురికివాడలోనే ఓ గ్రంథాలయాన్ని తెరిచింది. 121 పుస్తకాలతో తనలాంటి పేదపిల్లలు చదుకోవడానికి ఓ నీడ కల్పించింది.
చిన్నారి ముస్కాన్ కృషి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. తాజాగా కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సలహా సంస్థ నీతి ఆయోగ్ చిన్నారి ముస్కాన్ కృషిని గుర్తించింది. ఆమెను 'థాట్ లీడర్' పురస్కారానికి ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 12మంది ఈ పురస్కారానికి ఎంపికవ్వగా.. అందులో అతి పిన్నవయస్కురాలు ముస్కానే. రియో ఒలింపిక్స్లో పతకం గెలిచిన రెజ్లర్ సాక్షి మాలిక్ చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ముస్కాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నది.