మరో మూడు రోజులు నరకం తప్పదు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యభూతం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. రాబోయే మూడు రోజులలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 17 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీలో బయటి గాలి అసలు పీల్చుకోడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉందని చెబుతున్నారు. శీతాకాలం వాతావరణంలో కాలుష్యమేఘాలు మరింత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దాంతో ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా రాబోయే మూడు రోజుల పాటు పాఠశాలలన్నింటికీ సెలవులు ఇచ్చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. దేశ రాజధాని 'గ్యాస్ ఛాంబర్'లా మారిపోయిందనపి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో పీఎం 2.5, పీఎం 10 చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతున్నాయని హెచ్చరించింది. దానివల్ల బయటి గాలిని పీల్చుకోవడం ప్రజలకు తీవ్ర అనారోగ్యకరం అవుతుందని తెలిపింది. 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ధూళి రేణువులను పీఎం2.5గా (పర్టిక్యులేట్ మేటర్ 2.5) వ్యవహరిస్తారు. ఇవి కళ్లలోకి, గొంతు, ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్లిపోయి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తాయి. అదే పీఎం 10 అయితే మాత్రం దీనికంటే కొంత పర్వాలేదు. 10 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ ఉన్న ఈ ధూళి రేణువుల వల్ల దీర్ఘకాలిక, శాశ్వత ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుతం పీఎం 2.5, పీఎం 10 రెండూ అత్యధిక స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని.. అప్పుడు కూడా మాస్కులు ధరించి, ఇతర జాగ్రత్తలు తీసుకుని మాత్రమే రావాలని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.