బ్యాంకులోనే పనిచేస్తూ.. మేనేజర్ మృతి
బ్యాంకుల లోంచి, ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోడానికి క్యూలైన్లలో నిల్చుని మరణించారంటూ ఇన్నాళ్లూ కథనాలు వచ్చాయి. కానీ కస్టమర్లకు డబ్బులు ఇవ్వడానికి మూడు రోజులుగా బ్యాంకులోనే ఉండిపోయి రోజుకు దాదాపు 24 గంటలూ పనిచేస్తున్న ఓ బ్యాంకు మేనేజర్.. తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. రోహ్తక్ సహకార బ్యాంకు మేనేజర్ అయిన రాజేష్ కుమార్ బుధవారం ఉదయం తన చాంబర్లోనే మరణించి కనిపించారు. అంతకుము మూడు రోజుల నుంచి ఆయన బ్యాంకు బయట కాలు పెట్టలేదని, విపరీతమైన పని ఒత్తిడి వల్లే గుండెపోటు వచ్చిందని సహోద్యోగులు అంటున్నారు.
500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ఈనెల 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినప్పటి నుంచి బ్యాంకుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పనిచేశాయి. ఒక్క సోమవారం మాత్రం గురునానక్ జయంతి కారణంగా చాలావరకు బ్యాంకులకు సెలవు ఇచ్చారు. కానీ కొన్ని బ్యాంకులు ఆరోజు కూడా పనిచేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని క్యూలైన్లు ఉండటంతో.. రాజేష్ కుమార్ అలుపెరగకుండా పనిచేస్తూనే ఉన్నారు. రాత్రి పూట కూడా ఇంటికి వెళ్తే మళ్లీ పొద్దున్నే రావడం ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో రాత్రిళ్లు బ్యాంకులోనే నిద్రపోయారు. ఇప్పటికే ఆయనకు గుండెజబ్బు ఉందని, అందుకోసం మందులు వాడుతుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేష్ కుమార్ మృతితో బ్యాంకును ఒకరోజు మూసేశారు. ఉదయం సెక్యూరిటీ గార్డు వచ్చి మేనేజర్ తలుపు తట్టినా తీయకపోవడంతో.. ఇతర ఉద్యోగులను పిలిచాడు. అంతా కలిసి తలుపు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే ఆయన మరణించి కనిపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.