డిస్కమ్‌లకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: నగరానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న మూడు డిస్కమ్‌లకు శుక్రవారం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిస్కమ్‌ల లెక్కల్లో అవకతవకలున్నాయని, వాటిని కాగ్‌తో ఆడిట్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఎస్ఈఎస్ రాజ ధాని, బీఎస్ఈఎస్ యమునా, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తమ పిటిషన్‌ను వెంటనే విచారించాలని కోర్టును కోరాయి. ప్రైవేటు కంపెనీల లెక్కలను మదింపు చేసే అధికారం కాగ్‌కు లేదని, ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే స్టే జారీ చేయాలని డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కాగ్ జరిపే ఆడిట్‌కు సహకరించాల్సింది సూచించింది. కేసు తదుపరి విచారణను మార్చ్ 19కి వాయిదా వేసిన కోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు నివేదికను సమర్పించవద్దని కాగ్‌ను ఆదేశించింది. అంతేకాక డిస్కమ్‌ల ఆరోపణలకు సమాధానం ఇవ్వవలసిందిగా హైకోర్టు న్యాయమూర్తి ఢిల్లీ ప్రభుత్వానికి, కాగ్‌కు నోటీసులు జారీచేశారు.
వాడివేడిగా వాదనలు...
డిస్కమ్‌ల తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీ వాదించగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రశాంత్ భూషణ్ వాదించారు. వీరిద్దరి మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ముందుగా హరీశ్ సాల్వే మాట్లాడుతూ... ప్రభుత్వం ముందుగా నిర్ధారించుకొని ఆడిట్‌కు ఆదేశించిందని ఆరోపించారు. వాదన వినింపిచే అవకాశాన్ని ప్రభుత్వం తమకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఏదైనా ప్రైవేటు కంపెనీ ఖాతాలను ఆడిట్చేసే అధికారం కాగ్‌కు లేదన్నారు.
ప్రభుత్వం మెదడు పెట్టి ఆలోచించకుండా డిస్కమ్‌ల ఆడిట్‌కు ఆదేశించిందని విమర్శించిన ఆయన ప్రభుత్వ ఆదేశాన్ని ‘షేక్ చిల్లీ’ ఉత్తర్వుగా ఆయన అభివర్ణించా రు. కాగ్‌తో ప్రైవేటు కంపెనీల ఖాతాలను ఆడిట్ చేయించడానికి అనుమతించినట్లయితే అన్ని పన్నులు కన్సాలిడేటెడ్ఫండ్ ఆఫ్ ఇండియాలోనే జమ అవుతాయి కనుక దేశంలోని ప్రతి ప్రైవేటు పౌరుని ఖాతాలను ఆడిట్ చేసేందుకు కాగ్‌ను అనుమతించినట్లేనని అన్నారు. టెలికమ్ సంస్థలకు వర్తించే నియమాలు డిస్కమ్‌లకు వర్తించవని ఆయన వాదించారు.
డీఈఆర్సీ సిఫారసుల్లోనే ఉంది..
ప్రభుత్వం తరఫున వాదించిన ప్రశాంత్ భూషణ్ కూడా ప్రత్యర్థి వాదనలు తనదైన శైలిలో తిప్పికొట్టారు. డిస్కమ్‌ల ఖాతాలను ఆడిట్ చేయించాలని డీఈఆర్సీ 2010లో సిఫారసు చేసిందని గుర్తుచేశారు. డిస్కమ్‌ల ఖాతాలలో అవకతవకలు జరుగుతున్నాయని, లెక్కల్లో ఎటువంటి అవకతవకలు జరగకపోతే ఆడిట్‌ను ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మన్మోహన్ దీనిపై సమగ్ర విచారణ జరపవలసి న ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విద్యుత్ పంపిణీని ఢిల్లీ విద్యుత్తు బోర్డు నుంచి డిస్కమ్‌లకు బదిలీ చేసినప్పటి నుంచి.. అంటే 2002 నుంచి డిస్కమ్‌ల ఖాతాలను కాగ్ ఆడిట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.
ఇదిలాఉండగా డిసెంబర్లో ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి వెనువెంటనే ఈ మూడు డిస్కమ్‌ల లెక్కలు తేల్చేందుకు కాగ్‌తో అడిట్ జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాగ్ అధికారితో కూడా సమావేశం అయ్యారు. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఈ మూడు డిస్కమ్‌ల లావాదేవీలను ఆడిడ్ జర పాలంటూ కాగ్‌ను ఆదేశించారు. దీంతో ప్రభు త్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డిస్కమ్‌లు హైకో ర్టును ఆశ్రయించాయి.