మరో ముగ్గురు బలి
రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. మరో మగ్గురు రైతులు బలి కావడం బుధవారం వెలుగు చూసింది. అన్నదాతల ఆత్మహత్యలు, గుండె పగిలి మరణిస్తుండడంతో రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. తమను ఆదుకునే విధంగా భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తంజావూరులో రైతు సంఘాలు ఆందోళనతో పాటుగా భిక్షాటన చేశాయి.
సాక్షి, చెన్నై: డెల్టా జిల్లాల్లో కావేరి జలాల కరువుతో అన్నదాతలు కన్నీటి మడుగులో మునిగిన విషయం తెలిసిందే. మొలకెత్తని విత్తనాలు, మొలకెత్తినా నీళ్లు లేక ఎండుతున్న పంటల్ని చూసి రైతుల గుండెలు పగులుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా రైతులు గుండె పగిలి, బలవన్మరణాలతో మత్యువాత పడ్డారు. ఈ పరిణామాలతో రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. బలవర్మరణాలు వద్దు అని వేడుకుంటున్నారుు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భరోసా ప్రకటన చేయాలని విన్నవిస్తున్నా స్పందన కరువే. అందుకే కాబోలు రైతు మరణాల సంఖ్య పెరుగుతున్నట్టుంది. మరో ముగ్గురు రైతులు విగత జీవులుగా మారడం బుధవారం వెలుగు చూసింది.
మరో ముగ్గురి బలి: నాగపట్నం జిల్లా కీలయూరుకు చెందిన మారిముత్తు మూడు ఎకరాల్లో వేసిన పంట ఎండుతుండడాన్ని చూసి తీవ్ర మనో వేదనకు గురి అయ్యాడు. పంట పొలంలోనే మంగళవారం రాత్రి గుండె ఆగి కుప్పకూలాడు. విగత జీవిగా పడి ఉన్న అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తిరువారూర్ జిల్లా కొరట్టచ్చేరి సమీపంలోని ముసిరి గ్రామానికి చెందిన శేఖర్ ఎండుతున్న పంట, అప్పుల బాధలతో కలత చెంది పరుగుల మందు తాగి బుధవారం ఉదయం పంట పొలంలోనే సృ్పహ తప్పాడు. దీనిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, మరణించాడు. తూత్తుకుడి జిల్లా కై త్తారుకు చెందిన మురుగన్ సైతం పది ఎకరాల పంట ఎండుతుండడాన్ని చూసి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఆ సంఘాల నాయకుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా, అధికారుల్ని నిలదీసేందుకు ఆందోళనలు చేపట్టారు. తంజావూరులో ఆందోళనలతో పాటుగా, ఆ జిల్లా కలెక్టర్ అన్నాదురై వద్ద ముట్టడించి భిక్షాటనకు దిగారు. ఎండిన పంటను తీసుకొచ్చి కలెక్టరేట్ ఆవరణలో ఉంచి, చేతిలో మట్టి పాత్రతో భిక్షాటన సాగించారు. అయితే రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నట్టుగా కంటి తుడుపు చర్యగా కలెక్టర్ భరోసా ఇచ్చి పంపించారు.