రెవెన్యూ అధికారులపై దూసుకెళ్లిన లారీ
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓర్వకల్లు మండలం నన్నూరు సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఓ లారీ రెవెన్యూ అధికారులపైకి దూసుకు వెళ్లింది. ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో గ్రామ సేవకులు వెంకటేశ్వర్లు, శివరాములు, స్థానికుడు గోపాల్ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్ఐ శ్రీనివాసులు, మరో గ్రామ సేవకుడు రామకృష్ణ చనిపోయారు. తహసీల్దార్ సునీతా బాయి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో నిట్ ఏర్పాటుకు స్థల పరిశీలనకు కలెక్టర్ పర్యటన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు బుధవారం పూడిచర్లమెట్టకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో నంద్యాల నుంచి కర్నూలు వెళుతున్న ఓ ఇసుక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలుచున్న వీరిపైకి దూసుకు వెళ్లింది. కలెక్టర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తామని తెలిపారు.