three kilometers walk
-
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
పింఛను కోసం వెళ్లి మరలిరాని లోకాలకు..
అనంతపురం: పింఛను కోసం ఓ వృద్ధుడు మూడు కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లి... అలసి చివరికి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో గురువారం జరిగింది. బుదిలివాండ్ల పల్లి గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి (70) వృద్ధాప్య పింఛను కోసం గురువారం మూడు కిలోమీటర్ల దూరంలోని జెక్కసముద్రం వెళ్లాడు. పింఛను తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు శివారెడ్డిని పైకిలేపి ఆయన స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కించారు. ఇంటికి చేరుకున్న తర్వాత వెంకటశివారెడ్డి పడుకుని మళ్లీ లేవలేదు. ఆయన గుండె ఆగి మరణించినట్లు సమాచారం. శివారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. (గోరంట్ల)