పింఛను కోసం ఓ వృద్ధుడు మూడు కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లి... అలసి చివరికి తుదిశ్వాస విడిచాడు.
అనంతపురం: పింఛను కోసం ఓ వృద్ధుడు మూడు కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లి... అలసి చివరికి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో గురువారం జరిగింది. బుదిలివాండ్ల పల్లి గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి (70) వృద్ధాప్య పింఛను కోసం గురువారం మూడు కిలోమీటర్ల దూరంలోని జెక్కసముద్రం వెళ్లాడు. పింఛను తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు శివారెడ్డిని పైకిలేపి ఆయన స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కించారు. ఇంటికి చేరుకున్న తర్వాత వెంకటశివారెడ్డి పడుకుని మళ్లీ లేవలేదు. ఆయన గుండె ఆగి మరణించినట్లు సమాచారం. శివారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.
(గోరంట్ల)