మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి
రాష్ట్రానికి కొత్తగా 450 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విద్యలో చేరే విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రాష్ట్రానికి మరో మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతినిచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 26 మెడికల్ కాలేజీలకు ఎంసీఐ అనుమతివ్వగా.. వాటిలో మూడు తెలంగాణలోని సంస్థలకు ఇచ్చింది. మెదక్ జిల్లా ములుగూరు మండలంలోని ఆర్వీఎం మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లాలోని మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, పటాన్చెరులోని మహేశ్వర మెడికల్ సెన్సైస్కు అనుమతులు వచ్చాయి.
వీటిలో ఒక్కో కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున రానున్నాయి. మొత్తం 450 సీట్లల్లో 225 సీట్ల (50 శాతం)ను కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఎంసెట్-3లో ర్యాంకులు సాధించిన వారు ఈ సీట్లను పొందుతారు. మిగిలిన 225 మేనేజ్మెంట్ సీట్లను నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు పొందొచ్చు. ఈ కళాశాలలకు సంబంధించిన తనిఖీలు సెప్టెంబర్లో జరగనున్నాయి.