160 మంది డాక్టర్లు గన్ లైసెన్స్ కోసం అప్లై చేశారు!
బీహార్ రాష్ట్రంలో వైద్యులపై దాడులు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. వైద్యులకు ఫోన్లు చేస్తున్న రౌడీ మూకలు రూ.కోటి నుంచి 50 లక్షల వరకు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నెల నెల మామూలు ఇవ్వాలని లేకపోతే చితకబాదుతామని లేదా కాల్చి చంపుతామని బెదిరిస్తున్నారు. దీంతో ఉలిక్కిపడిన డాక్టర్లు రక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో దాదాపు 23 కేసులు ఇలా నమోదయినవే అంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
గత అక్టోబర్ లో ఆరియా జిల్లాకు చెందిన డా.యోగేంద్ర ప్రసాద్ ను కొంతమంది దుండగులు నెల వారీ మామూలుగా 10వేలు ఇవ్వడం లేదని చితక్కొట్టారు. గోపాల్ గంజ్ కు చెందిన డా.ఓ.పీ.లాల్, శివన్ కు చెందిన డా. రాజ్ కిషోర్ సింగ్ లను డబ్బులు ఇవ్వనందుకు తుపాకీతో కాల్చారు. పాట్నాకు చెందని ప్రముఖ డాక్టర్లు డా. హేమంత్ కుమార్ వర్మ, డా.ఏ.కే. సింగ్ లకు రూ.కోటి, రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వెళ్లాయి. వరుస ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన బీహారీ డాక్టర్లలో 160 మంది తమకు తుపాకీ లైసెన్స్ కావాలంటూ అప్లికేషన్లు పెట్టుకున్నారు.
ఈ విషయం డాక్టర్లందరూ రోడ్లెక్కి పోరాటం చేస్తారని భారతీయ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) కార్యదర్శి డా. కేకే అగర్వాల్, డా. సచ్చిదానంద కుమార్,ఐఎమ్ఏ చైర్మన్ లు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి పిటిషన్ అందిస్తామని వివరించారు. పాలిగంజ్ లో ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే డా.ప్రవీణ్ కుమార్ ను ఆరుగురు వ్యక్తులు ఆయుధాలతో అడ్డగించడంతో ఆయన తప్పించుకు పారిపోయారని, ప్రవీణ్ అసిస్టెంట్ మాత్రం కాల్చిచంపారని, డ్రైవర్ ను తీవ్రంగా కొట్టినట్లు వివరించారు. ఈ దాడులు 2005లో డాక్టర్ల మీద జరిగిన దాడులను గుర్తుకు తెస్తున్నాయని అప్పట్లో జరిగిన దాడుల్లో కొంత మంది డాక్టర్లను బలవంతంగా రాష్ట్రం నుంచి పంపివేసినట్లుగా పాట్నాకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తెలిపారు.