గుడారాలే ఆవాసం
అలంపూర్, న్యూస్‌లైన్: వరద బాధితులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. పునరావాసం కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలయమ్యారు. జల ప్రళయంలో ఇళ్లను కోల్పోయిన వారు గుడారాల్లోనే మగ్గాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వాసితులను పట్టించుకునే వారు కరువయ్యారు. భారీ వర్షాలతో 2009 అక్టోబర్ 2వ తేదీన తుంగభద్ర నదికి వరదలు వచ్చి భారీ నష్టం వాటిల్లింది.
వరదల్లో సర్వస్వం కోల్పోయిన అలంపూర్ బాధితులకు స్థానిక ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో 43 ఎకరాల స్థలం కొనుగోలు చేసి ప్లాట్లుగా మలిచారు. నిర్వాసితులకు పట్టాలైతే ఇచ్చారు...కానీ ప్లాట్లు మాత్రం కేటాయించలేదు. అలాగే మద్దూరు గ్రామంలోని నివాస గృహాలు తుంగభద్ర నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మొండి గోడలు మిగిలాయి. అయినా నిర్వాసితులకు పునరావాసం కోసం కనీసం స్థల సేకరణ ఎటూ తేలకుండాపోయింది. రాజోలిలోని ఇళ్లు పేకమేడలా కుప్పకులిన పునరావస గృహాల నిర్మాణం పూర్తి కా లేదు. గూడు కోల్పోయిన నిర్వాసితులు గుడారాల్లో చ లికి వణుకుతు...వానకు తడుస్తూ..ఎండకు ఎండుతు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు.
ముళ్ల పొదల్లో ప్లాట్లు :
అలంపూర్ ప్రభుత్వ అతిథి గృహం వెనక భాగంలో ని ర్వాసితులకు 43 ఎకరాలు సేకరించారు. రెండేళ్ల త ర్వాత స్థలాన్ని సేకరిస్తే మరో ఏడాదిపాటు మరునపడేసి 913 ప్లాట్లుగా వేశారు. స్థానిక ఎన్నికల ముందు లబ్ధి పొందడానికి వీలుగా అధికార పార్టీ నాయకులు కొంత మంది నిర్వాసితులకు పట్టాలిచ్చారు. కానీ పట్టాలిచ్చి ఏడాది కావస్తున్నా వారికి ప్లాట్లు కేటాయిం చలేదు. ఆ ప్రాంతంలో ముళ్ల పొదాలు మొలిచాయి. గతంలో జాబితాకు అనువుగా మిగిలిన 450 మందికి ప్లాట్లు కేటాయించడానికి అదనంగా మరో 20 ఎకరా ల స్థలాన్ని సేకరించడానికి అధికారులు నిర్ణయిం చారు. కానీ స్థల సేకరణ కేవలం సర్వేలకే పరిమితమైంది. దీంతో వరదల్లో గూడు కోల్పోయిన నిర్వాసితులు గుడారాల్లోనే దుర్భరమైన జీవనం గడుపుతున్నారు.
అటకెక్కిన స్థల సేకరణ :
మానవపాడు మండలంలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్న మద్దూరు గ్రామం వరద ముంపుకు గురైంది. నాలుగేళ్లుగా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకోవడంలో స్థల సేకరణ ఇప్పటికి పూర్తికాలేదు. జిల్లా అధికారులు హడావుడి చేస్తే గ్రామానికి చుట్టపు చూపుగా వెళ్లడం, స్థలాన్ని పరిశీలించి రావడంతోనే సరిపోతుంది. 500 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో కనీసం ఎకరం పొలాన్ని ఇప్పటికి కొనుగోలు చేయలేదు. దీంతో నాలుగేళ్లుగా పునరావాసం కోసం ఎదురు చూడటంతోనే కాలం గడిచిపోతుంది. వరదల్లో సర్వం కోల్పోయిన గ్రామస్తులు కొందరు నిలువ నీడలేక వలసపోయారు.
నిర్మాణానికి మోక్షం లేదు..
వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామంలో నిర్వాసితులకు పునరావాసం కింద 212 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 3048 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చూట్టారు. అందులో ఇప్పటికి 2025 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టగా దాదపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. 525 ఇళ్ల నిర్మాణం ఇప్పటికి ప్రారంభమే కాలేదు. వరద ప్రభావిత గ్రామమైన తూర్పుగార్లపాడులో 260 మందికి ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. పనులు ఆర్థాంతరంగా నిలిచిపోవడంతో నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు.