ఎందుకిలా చేశారు?
గుర్ గావ్: 'వీళ్లకు హృదయం లేదు. దేవుడు, చట్టం, సమాజం అంటే భయం లేదు'... తన ముద్దుల కూతురి చేతివేలు పోవడానికి కారణమైన డేకేర్ సెంటర్ నిర్వాహకులపై ఓ మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. తన గారాలపట్టికి జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ఆమె గొంతెత్తింది. లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ పసిపిల్లల ప్రాణాలను ఫణంగా పెడుతున్న విద్యా వ్యాపారులపై విప్లవ శంఖం పూరించింది.
దేశ రాజధాని సమీంలోని గుర్ గావ్ లో ఏప్రిల్ 28న చోటుచేసుకున్న ఈ ఘటన కార్పొరేట్ విద్యాసంస్థల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. శివాని శర్మ అనే మహిళ తన మూడేళ్ల కూతురు మిరాను చెరబ్ ఏంజెల్ అనే డేకేర్ సెంటర్ లో చేర్చారు. ఏప్రిల్ 28న ఆమెకు టీచర్ ఫోన్ చేసి మీ అమ్మాయి కుడిచేతి బొటనవేలు చితికిపోయిందని, ఆస్పత్రికి తరలించామని చెప్పింది. వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లారు. చేతివేతి గాయంతో విలవిల్లాడుతున్న మిరాను చూసి చలించిపోయారు. ఏమైందని టీచర్లను నిలదీశారు. కార్తీక్ అనే విద్యార్థి తలుపు వేయడంతో మిరాకు గాయమైందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
జాగ్రత్తగా చూసుకోమని మీకు అప్పగిస్తే ఇలా చేస్తారా అని టీచర్లను శివాని ప్రశ్నించింది. బొటనవేలు పైభాగం బాగా చితికిపోవడంతో దాన్ని తొలగించారు. డే కేర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తన కూతురు బొటనవేలు కోల్పోయిందని శివాని ఆవేదన వ్యక్తం చేసింది. డేకేర్ నిర్వాహకులపై కేసు పెట్టింది. దీంతో దిగొచ్చిన డేర్ కేర్ యజమానులు క్షమాపణ చెప్పారు. మిరాకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీయిచ్చారు.
అయితే తర్వాత వారు పత్తా లేకుండా పోయారు. తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని, పోలీసులతో బెదిరిస్తున్నారని శివాని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా జాగ్రత్త పడాలని ఫేస్ బుక్ ద్వారా కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డే కేర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.