సైన్స్ ఈస్ట్‌మన్ కలర్లో..
సైన్సు క్లాసు పిల్లలకు విజ్ఞానం. సినిమా వాళ్లకు వినోదం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సైన్సు ఆధారంగా తయారైన తెలుగు సినిమాలెన్నో. నేడు నేషనల్ సైన్స్ డే సందర్భంగా... ఆదివారం ప్రత్యేకం
హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ తీయడం క్షణాల్లో పని. వారు కథలు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. ఆత్రేయ ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని రాశారు. హాలీవుడ్ వాళ్లు కలల్లోకి వెళ్లడాన్ని కూడా తీసుకుని సినిమాలు తీశారు. ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ అనే ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఇక మన మధ్య ప్రేమ వద్దు అనుకుంటారు. బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయినా పాత జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు మాత్రం ఎందుకు అనుకుని ఒక టెక్నాలజీ ద్వారా ఆ జ్ఞాపకాలన్నీ ఇద్దరూ చెరిపేసుకుంటారు. ఆ తర్వాత ఏమయ్యింది అనేది కథ. చూడండి ఎంత బాగా ఆలోచించారో. తెలుగులో ఈ స్థాయి ఆలోచన రావడానికి చాలా కాలం పడుతుంది. కాని తెలుగు ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తమిళ భాషల్లో సైన్స్‌ని కమర్షియల్ సినిమాకు బాగానే ఉపయోగించుకున్నారు.
తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా క్రైమ్ సినిమాలు మొదలయ్యాక సైన్సు, సైంటిస్టు అనే మాటలు ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించడం మొదలయ్యాయి. ఒక సైంటిస్ట్ ఏదో ఫార్ములా కనిపెడతాడు. దాని కోసం విలన్ వెంటపడతాడు. ఆ సైంటిస్ట్ కూతురు తండ్రి కోసం వెతుకుతుంటుంది. హీరో సాయం చేస్తాడు. మనకు సైన్స్ అంటే ఒక ల్యాబ్, బుడగలు తేలే బీకర్లు మాత్రంగా చాలా కాలం సినిమాలు నడిచాయి. కాని సైన్స్‌ను లేశమాత్రంగా కథల్లో ప్రవేశ పెట్టడం మెల్లగా మొదలైంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నటించిన ‘దొరికితే దొంగలు’ దాదాపుగా సైన్స్ ఫిక్షన్‌గా చెప్పే వీలైన తొలి తెలుగు సినిమా అనుకోవచ్చు. ఇందులో రాజనాల, సత్యనారాయణ, అల్లురామలింగయ్యలు తెర వెనుక సైంటిఫిక్ పవర్స్‌ను అడ్డుపెట్టుకొని నానా అఘాయిత్యాలు చేస్తుంటారు. చివరకు ఎన్.టి.ఆర్ వారి ఆట కట్టిస్తాడు. ఆ తర్వాతి రోజుల్లో కృష్ణ ‘రహస్య గూఢచారి’ సినిమా వచ్చింది. ఇందులో విలన్ సత్యనారాయణ విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టి అణు రాకెట్లు తయారు చేస్తాడు. ‘ఒక మీట నొక్కితే కుంభవృష్టి కురుస్తుంది.. ఒక మీట నొక్కితే సముద్రం ఆవిరవుతుంది’ అని చెబుతాడు. అయితే సహజంగానే కృష్ణ అతణ్ణి మట్టి కరిపిస్తాడు. కాని రహస్య గూఢచారిలో విలన్ చేసిన పని మనిషి త్వరలోనే చేస్తాడనిపిస్తుంది.
దర్శకుడు గీతాకృష్ణ ‘కోకిల’ అనే సినిమా తీశారు. ఇందులో ప్రమాదరీత్యా కళ్లు పోయిన హీరోకు వేరొకరి కళ్లు అమరుస్తారు. అయితే అతడు కళ్లు తెరిచినప్పటి నుంచి ఒక హత్య జరిగిన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కళ్లయితే నరేశ్‌కు పెట్టారో ఆ కళ్లు ఆఖరిసారిగా ఆ హత్యను చూశాయి. ఆ కళ్లకు ఆ మెమొరి అలా ఉండిపోయి ఆ దృశ్యం ఇప్పుడు నరేశ్‌కు కనిపిస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా జనం ఓకే చేశారు. సినిమా హిట్ అయ్యింది.
∙∙
అయితే తెలుగువాళ్లు ఈనాటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సైన్స్ ఫిక్షన్ మాత్రం ‘ఆదిత్యా 369’ సినిమాయే. టైమ్ మిషన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో హీరో బాలకృష్ణ హీరోయిన్ను తోడు చేసుకుని టైమ్ మిషన్‌లో రాయలవారి కాలానికి వెళతాడు. ఆ తర్వాత అత్యంత రేడియేషన్ ఉండే భవిష్యత్ కాలానికి కూడా వెళతాడు. ఆ సినిమా లో వీడియో కాల్స్, సెల్‌ఫోన్ కాల్స్ లాంటివి ఊహించారు. ఆ సినిమాలో సైంటిస్ట్‌గా టిన్నూ ఆనంద్ నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా తీసినందుకు గాను దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చాలా మంది ప్రేక్షకులకు మరింత ఇష్టులు అయ్యారు. దీని సీక్వెల్ గురించి ఎన్నో ప్రయత్నాలు సాగాయి కాని జరగలేదు.
సైన్స్ ఫిక్షన్‌ను పెద్ద హీరోల మీద భారీగా ఉపయోగించాలి కాని కామెడీగా కాదని సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘నాని’ నిరూపించింది. ఇందులో కూడా ఒక పిచ్చి సైంటిస్ట్ చేసిన ఒక ప్రయోగం వికటించి చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారడం ఆ పెద్దగా ఉన్న సమయంలో వివాహం కూడా జరిగిపోవడం ఇవన్నీ ఫన్నీగా ఉన్నా జనం మెచ్చలేదు. మహేశ్ బాబు అభినయం, ఏ.ఆర్.రెహమాన్, అమీషా పటేల్ అల్లరి సినిమాను కాపాడలేకపోయాయి.
∙∙
అదే సమయంలో తమిళం నుంచి డబ్ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెలుగువే అన్నంత బాగా ఇక్కడ హిట్ అయ్యాయి. శంకర్ తీసిన ‘రోబో’ పెద్ద సంచలనం రేపింది. శాస్త్రం శృతి మించితే మనిషికి బానిసగా ఉండటం కాక మనిషినే బానిసగా చేసుకుంటుందని చెప్పిన ఈ సినిమా కలెక్షన్ల దుమారం రేపింది. రజనీకాంత్‌కు భారీ హిట్‌ను ఇచ్చింది. దీని కొనసాగింపుగా సెల్ టవర్ల దుష్ఫలితాలను తీసుకుని ‘రోబో2’ తీశారు కాని జనం మెచ్చలేదు. స్పష్టత కరువై ఎవరు హీరోనో ఎవరు విలనో తెలియకుండా పోయింది. హీరో సూర్య దర్శకుడు మురగదాస్‌తో కలిసి చేసిన ‘సెవెన్త్ సెన్స్’ భారతీయ సనాతన శక్తులను, శాస్త్రీయ శక్తులను చర్చించింది. ఇందులో వైరస్ చైనా నుంచి దిగుమతి అయినట్టు చూపడం మొన్న కరోనా సమయంలో చర్చకు వచ్చింది. సూర్య దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తీసిన ‘24’ కూడా హిట్ అయ్యింది. ఈ సినిమా సమయాన్ని బంధించడం గురించి అందమైన ఊహ చేసింది. అలాంటి రోజులు వస్తాయేమో తెలియదు. అలాగే అంతరిక్షం కథాంశంగా వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి మార్కులే సంపాదించింది.
∙∙
సైన్స్ ఫిక్షన్ మీద తెలుగు సినిమా పెట్టుకున్న నమ్మకం అన్నిసార్లు సక్సెస్ ఇవ్వలేదు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అంతరిక్షం’ తొలి తెలుగు అంతరిక్ష నేపథ్య సినిమాగా నమోదైనా విజయం సాధించలేదు. హీరో వరుణ్‌తేజ్‌ను ఇది నిరాశ పరిచింది. ఇక విజయేంద్ర ప్రసాద్ కథతో వచ్చిన ‘శ్రీవల్లి’ సినిమా బ్రైన్ వేవ్‌ను కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఎదుటివారిని తమ అదుపులోకి తేవడం అనే అంశాన్ని చర్చించినా జనానికి కనెక్ట్ కాలేదు. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో, రవితేజా ‘డిస్కో రాజా’లో శాస్త్రీయ అంశం కనిపించింది.
సైన్స్ ఒక సముద్రం. దాని నుంచి ఎన్ని కథలైనా అల్లవచ్చు. అయితే విజ్ఞానం, వినోదం సమపాళ్లలో కలిపినప్పుడు ఆ జానర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో మంచి సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం.
– సాక్షి ఫ్యామిలీ