రైల్వే టిక్కెట్ చెకింగ్ పోస్టుల భర్తీకి ఒత్తిడి తేవాలి
గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు డివిజన్లో దీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న టిక్కెట్ చెకింగ్ పోస్టుల భర్తీకి రైల్వే బోర్డుపై ఒత్తిడి పెంచాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్సీఆర్ఎంయూ) డివిజన్ కార్యదర్శి కే.కళాధర్ పిలుపునిచ్చారు. స్థానిక రైల్వే క్రీడా మైదానం సమీపంలో ఉన్న యూనియన్ కార్యాలయంలో జరిగిన స్టేషన్ బ్రాంచ్ సర్వసభ్య సమావేశానికి సదరు చైర్మన్ కే.బాబురావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కళాధర్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఫళణిస్వామి, కోశాధికారి ప్రకాష్‌బాబు, ఏడీఎస్‌లు కేఎండీ గౌస్, ఇబ్రహీమ్ఖాన్, శ్రీనివాసులు, జయంత్‌కుమార్ హాజరయ్యారు.
తొలుత స్టేషన్ బ్రాంచ్ సెక్రెటరీ బాలాజీ సింగ్ బుకింగ్ ఆఫీస్, రిజర్వేషన్ ఆఫీస్‌లలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు, గార్డ్స్, ఏఎస్‌ఎంలు, ఎస్‌అండ్‌టీ విభాగంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కే.కళాధర్ దృష్టికి తెచ్చారు. చితాపూర్ స్టేషన్లో రన్నింగ్ రూమ్స్‌లో గూడ్స్ గార్డ్స్ పడుతునన ఇబ్బందులను డివిజన్ అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించేలా ఒత్తిడి తేవాలని కోరారు. ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలులో గుంతకల్లుకు చెందిన స్లీపర్స్ టీటీఈలను కడప వరకు మాత్రమే అనుమతించాలని వారు కోరారు. కే.కళాధర్ మాట్లాడుతూ వాడి స్టేషన్లో టీటీఈలకు వసతి గృహాలు లేవని, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని డీఆర్ఎంను కోరుతామన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో ఖాళీగా ఉన్న 170 టిక్కెట్ చెకింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీటీఈలు, గార్డ్స్, ఎఎస్ఎంలు, ఎస్ అండ్ టీ విభాగం పాయింట్స్ మెన్, కమర్షియల్ క్లర్కులు పాల్గొన్నారు.
స్టేషన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ నూతన కమిటీ ఎన్నిక
సమావేశానంతరం ఎస్సీఆర్ఎంయూ గుంతకల్లు రైల్వే డివిజన్ స్టేషన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ కమిటీ చైర్మన్‌గా కే.బాబురావు, వైఎస్ చైర్మన్లుగా పీ.జాఫర్‌ఖాన్, జీ.రమేష్‌బాబు, కే.నగేష్‌కుమార్, ప్రంతోష్కుమార్, సెక్రెటరీగా బీ.బాలాజీ సింగ్, అసిస్టెంట్ సెక్రెటరీలుగా ఎన్.గురునాథ్, జే.భాస్కర్, ఎన్ఏఎస్ చారి, ట్రెజరర్‌గా జీఎం బాషా, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా సుధీర్‌కుమార్, రామాంజినేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కళాధర్ తెలిపారు. ఈ సందర్భంగా గుంతకల్లు రైల్వే డివిజన్లో పని చేస్తూ యూత్ కమిటీ లీడర్‌గా ఎన్నికైన జాఫర్‌ఖాన్, ఎస్సీఆర్ ఈసీసీఎస్ డెరైక్టర్‌గా ఎంపికైన దొరైరాజు భూషణంను సన్మానించారు. డివిజనల్ సెక్రెటరీ కే.కళాధర్ వీరిద్దరికి పూలమాలలు వేసి సత్కరించారు.