‘లక్ష్మణ్ రేఖ’ చిరంజీవి
‘‘బడ్జెట్ మీద కార్టూన్ వేయాలంటే మీ సమీక్ష నేలబారు మనిషికి చేరాలి. ఆర్థికమంత్రికి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి. వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్కరలేదు.’’
మనం తరచు చూసే దృశ్యం లో చూడని కోణాన్ని చూపిం చేది - కళ. మనం తరచు చేసే ఆలోచనలో ఆలోచించని కోణాన్ని ఆవిష్కరించేది కార్టూన్. అదీ కళే. ఈ రెంటినీ కేవలం 90 సంవత్సరాలు ఉపాసించిన కళాకారుడు ఆర్కే లక్ష్మణ్. మొదటి దృశ్యం - కాకి. లక్ష్మణ్ చిత్రాల్ని చూసినప్పుడు మనం రోజూ చూసే కాకిలో ఇంత కళాత్మకమైన వైవిధ్యం ఉన్నదా అని పిస్తుంది. మనం రోజూ వినే వార్తల పట్ల ఆయన కార్టూ న్ మన మనసుని గిలిగింతలు పెడుతూనే ఒక హెచ్చరిక చేస్తుంది.
మన నాయకులు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు - ప్రజాసంక్షేమం పేరిట. డ్యామ్లు నిర్మిస్తున్నారు- ప్రజాభ్యుదయం పేరిట. ప్రణాళికలు చేస్తున్నారు - ప్రజల్ని ఉద్ధరించే లక్ష్యంతో. ఆస్పత్రులను, విద్యాసంస్థలను, పునరావాస కేంద్రాలను నిర్మిస్తున్నారు- ప్రజల వికాసానికి. కాని, ఇంకా ఇంకా సగటు మనిషి అలాగే అడుక్కుతింటున్నాడు - అన్న సత్యాన్ని స్థూలంగా ఆర్కే లక్ష్మణ్ తన జీవిత కాలమంతా తన కార్టూన్ ద్వారా ఆవి ష్కరించారు. ఆయన కార్టూన్లలో గొప్ప శిల్పం ఏమిటంటే ఈ సగటు మనిషి ఏనాడూ నోరు విప్పి మాట్లా డలేదు. కళ గొప్ప సూచన. గొప్ప విశ్లేషణ. గొప్ప కను విప్పు.
నేటితరం రాజకీయ నాయకుల గురించి ఆయన సమీక్ష వినదగ్గది. ‘‘ఆనాటి నాయకులు - నెహ్రూ, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటివారు తమదైన వ్యక్తిత్వాలతో కనిపించేవారు. వారి మీద కార్టూన్ వేయడం ఒక అవకాశంలాగ ఉండేది. ఈ తరం నాయకులు- లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వినా- అందరూ ఒకే మూస. తమదైన వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా ఏమీ కని పించవు.’’
నోరెత్తి మాట్లాడని బడుగు మనిషి సమకాలీన సమాజపు సమీక్ష కోసం కోట్లాది మంది పాఠ కులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ‘యూ సెడ్ ఇట్’అనే రెండంగు ళాల కార్టూన్ కోసం 50 సంవత్స రాల పాటు పత్రికను చదివారు. రోడ్ల మీద గుంటలు, ట్రాఫిక్ దిగ్బం ధాలు, నీటి ఎద్దడి, బిచ్చగాళ్లు, నాయ కుల వెర్రితలలు- ఏవీ ఆయన దృష్టినీ, కార్టూన్లనీ దాటి పోలేదు. డెరిల్ డి‘మాంటే అనే చిత్రకారుడు ఆయనతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఒకసారి వ్యవసాయ భూముల మీద గరిష్ట పరిమితిని ప్రభుత్వం ఎత్తి వేసింది. కుంచించుకుపోతున్న రైతు నెత్తి మీద పెద్ద గుది బండని వేసి లక్ష్మణ్ కార్టూన్ పంపారు. ఇది బొత్తిగా ‘కథ చెప్పినట్టుంది’ అన్నారట డి‘మాంటే. వెంటనే ఆ కార్టూన్ని తెప్పించి- ఆ బండ మీద రాజకీయ నాయకుడు జల్సాగా కూర్చున్న చిత్రాన్ని వేశారట.
మరో కితకితలు పెట్టే కార్టూన్. ఒక రాజకీయ నాయకుడి కారు ముందు బడుగు మనిషి నిలబడి ఉన్నా డు. నాయకుడు పక్కవాడితో అంటున్నాడు, ‘‘ఇంకా నయం. స్వచ్ఛమైన తాగునీరు, స్కూళ్లు కావాలని అడు గుతారేమోనని భయపడుతున్నాను. అదృష్టవశాత్తూ వాళ్లు ప్రత్యేక రాష్ట్రాన్ని అడుగుతున్నారు.’’ ఓ పాత్రికేయుడు, ‘‘అయ్యా! మీ కార్టూన్లలో మేధావి చెణుకులు కనిపించవేం?’’ అని అడిగారట. ఆయన సమాధానం- ‘‘బడ్జెట్ మీద కార్టూన్ వేయాలం టే మీ సమీక్ష నేలబారు మనిషికి చేరాలి, ఆర్థికమంత్రికి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి. వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్క రలేదు.’’
ఆయన తరం కార్టూనిస్టు, ఆయన అభిమాని- సుధీర్ ధర్ ఆ రోజుల్లో ‘హిందుస్తాన్ టైమ్స్’లో పనిచేసేవారు. ఓసారి హిందు స్తాన్ టైమ్స్ ఆఫీసులో ఆయన బొమ్మ వేసుకుంటూండగా ఎవరో టేబుల్ దగ్గరకి వచ్చి నిలబడ్డారు. చూస్తే లక్ష్మణ్. ఆనందంతో ఉబ్బితబ్బి బ్బయ్యి తన సమక్షంలో బడుగు మనిషిని వేయమని అడిగారట. అతి సులువుగా వేసి, దాని మీద ‘హిందూస్తాన్ టైమ్స్’ అని రాసి పక్కనే ఒక శీర్షిక పెట్టారట: ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పక చదవండి!’అని. ధర్ ఆత్రుతగా ‘మీ ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్’ అని అన్నారట.
లక్ష్మణ్ పెన్ను తీసు కుని ఆటోగ్రాఫ్ రెండుసార్లు పెట్టారట. ఆయనకి ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్నీ, దరిమి లాను పద్మవిభూషణ్ పురస్కా రాన్నీ ఇచ్చింది. వ్యవస్థని దుయ్యబట్టే కళకి వ్యవస్థ అర్పించిన గౌరవప్రదమైన నివాళి ఇది. సామాజిక అరా చకం పట్ల కళాకారుడి విమర్శ- ఆరోగ్యకరమైన చికిత్స అని తన జీవిత కాలంలోనే వ్యవస్థను ఒప్పించిన కళాకా రుడు, నేలబారు మనిషిని ప్రజల మనసుల్లో చిరంజీవిని చేసిన అపూర్వ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్. మారని ఈ లోకం లో మార్పు అవసరమన్న స్పృహని ఒక పక్క చిన్న నవ్వు తో, వెనువెంటనే చిన్న కవ్వింపుతో ఒక జీవితకాలం కలి గించిన గొప్ప వైద్యుడు లక్ష్మణ్.
- గొల్లపూడి మారుతీరావు