Time scale workers
-
రెగ్యులర్ పోస్టులు కాదు.. టైమ్ స్కేలే!
సాక్షి, అమరావతి: డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. వీరికి న్యాయం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని ప్రభుత్వం ఏదో విధంగా నీరుగార్చే పరిస్థితి కనిపిస్తోంది. టీచర్ ఎమ్మెల్సీలతో ప్రభుత్వం నియమించిన కమిటీ.. అప్పట్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల్లోని కేవలం 33 మంది మాత్రమే టైమ్ స్కేలుకు అర్హులని తేల్చుతూ ప్రభుత్వానికి తాజాగా ఇచ్చిన నివేదికలో పేర్కొంది. మిగతా వారిని విద్యావలంటీర్లుగా అవకాశం కల్పిస్తే సరిపోతుందని ఆ నివేదికలో పొందుపరిచారు. సుదీర్ఘకాలం ఎదురుచూపులు 1998లో మొత్తం 36,136 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అప్పట్లో డీఎస్సీలో 85 మార్కులకు పరీక్ష, 15 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు ఎంపిక చేసే విధానాన్ని అమలుచేశారు. అర్హత మార్కుల కింద ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులు రావాలని నిబంధన పెట్టారు. ఆ డీఎస్సీ రాత పరీక్షల్లో 18 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. పోస్టులకన్నా అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండడంతో అప్పట్లో ప్రభుత్వం అర్హత మార్కులను 5 చొప్పున అన్ని కేటగిరీల్లోనూ తగ్గించింది. అలా తగ్గించాక మరికొందరు అభ్యర్థులు అర్హత సాధించారు. అప్పట్లో ఈ అభ్యర్థులకు పోస్టుల కేటాయింపులో అనేక అవతకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటర్వ్యూల్లో తమకు కావాల్సిన వారికి ఎక్కువ మార్కులు వేసి.. వారికి ఉద్యోగాలు వచ్చేలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. రాత పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి తీరని అన్యాయం జరిగింది. దీనిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా రాత పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు.. అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వెలువరించినా దాన్ని అమలు చేయకుండా తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని, తక్కిన పోస్టులకు అర్హులు లేనందునే అర్హత మార్కులు తగ్గించామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అందరికీ పోస్టులు ఇవ్వకుండానే ఇలా కోర్టుకు తెలియచేయడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అందరికీ ఉద్యోగాలివ్వాలని ట్రిబ్యునల్ 2009లో తీర్పు ఇవ్వగా.. విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఆ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాల్సిందేనని.. పాత తేదీల నుంచి నియమిస్తూ అప్పటి నుంచి వేతన బకాయిలు కూడా చెల్లించాలని 2011లో మళ్లీ హైకోర్టు స్పష్టంచేసింది. అయినా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం, ఆ డీఎస్సీ ముగిసినందున పోస్టులు లేవని ప్రభుత్వం చెప్పడంతో ధిక్కార పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పు సరికాదంటూ.. అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇలా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అభ్యర్థులకు రెండు దశాబ్దాలుగా పోస్టులు మాత్రం దక్కలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలు ముందు వీరికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఆయనను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉద్యోగాలు రాక పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. వీళ్లకు ఇస్తే.. వాళ్లూ అడుగుతారు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేవలం 33 మంది మాత్రమే అర్హులున్నట్లు తేలింది. వారికి కూడా రెగ్యులర్ పోస్టులు ఇచ్చేందుకు వీలుకాదు. అలా ఇస్తే ఆ తర్వాత డీఎస్సీలో క్వాలిఫై అయిన వాళ్లూ అడుగుతారు. అందుకే ఈ 33 మందికి మాత్రమే టైమ్ స్కేల్ ఇవ్వాలన్నాం. తక్కిన వారిని విద్యావలంటీర్లుగా తీసుకుంటారు. – గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్సీ కమిటీ సభ్యుడు కమిటీ నివేదిక అశనిపాతం అభ్యర్థులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించి.. పాఠశాల విద్యాశాఖ ద్వారా ఎమ్మెల్సీలతో కమిటీని నియమించారు. 13 జిల్లాల్లో.. 4,535 మంది అర్హులైన అభ్యర్థులున్నారని, వీరికి టైమ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించింది. మే 30న ప్రభుత్వానికి నివేదికను అందించింది. అయితే టైమ్స్కేలుకు నిర్ణయించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆ తర్వాత కోతపడింది. అప్పట్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల్లో కేవలం 33 మందే టైమ్ స్కేలుకు అర్హులని తాజాగా తేల్చింది. మిగతా వారిని విద్యావలంటీర్లుగా అవకాశం కల్పిస్తే సరిపోతుందనడం అభ్యర్థుల పాలిట అశనిపాతంగా మారుతోంది. అయితే ఈ కమిటీ సూచనలను అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
పంచాయతీలు విలవిల
రోజురోజుకూ కునారిల్లుతున్న పంచాయతీల దుస్థితికి పాలకులే కారణం. ఈ పాపంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తోడవడం మరీ ఘోరం. గ్రామాభివృద్ధికి పన్నుల వసూళ్లే కీలకం. వాటిని వసూలు చేయకపోవడంతో బకాయిలు ఏటేటా కొండలా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఫలితంగా సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో 1028 పంచాయతీలున్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఏటా పన్నులు వసూలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలి. జిల్లా పంచాయతీ అధికారి తరచూ తనిఖీలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి సూచనలివ్వాలి. పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ ఈ జిల్లాలో కనిపించడం లేదు. ఒక్కసారి 2013-14 సంవత్సరంలో పన్నుల వసూళ్లను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. మొత్తం రూ.13,24,29,898లకు గాను ఇప్పటి వరకు రూ.8,82,78,081 మాత్రమే వసూలు చేశారు. ఇవికాక పాత బకాయిలు దాదాపు రూ.22,05,48,490 ఉండగా, ఇప్పటి వరకు రూ.12,20,75, 054 వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలున్నాయి. చాలినన్ని నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయి. జీతాలు లేక అవస్థలు = పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలిచ్చే పరిస్థితి లేదు. = పారిశుద్ధ్య కార్మికులతో పాటు టైమ్ స్కేల్ కార్మికులు, పర్మనెంట్, టెండర్.. ఎన్ఎంఆర్ విధానంలో కార్మికులు పనిచేస్తున్నారు. = జిల్లాలో పర్మనెంట్, టైమ్ స్కేల్ కార్మికులు దాదాపు 125 మంది వరకు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు. = పర్మనెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011లో అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. = దీనికి జిల్లా స్థాయి కమిటీ కూడా ఉంది. కమిటీ నిర్లక్ష్యం కారణంగా వారు ట్రెజరీ ద్వారా జీతాలకు నోచుకోవడంలేదు. పారిశుద్ధ్య కార్మికులకు చాలాచోట్ల నేటికీ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబంతో సహా తల్లడిల్లుతున్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు = విద్యుత్ బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి. = గత ప్రభుత్వాలు మైనర్ పంచాయతీలు కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని అప్పట్లో సర్పంచ్ల సంఘానికి హామీ ఇచ్చాయి. = జిల్లాలో దాదాపు 106 పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.12 కోట్ల వరకు ఉన్నాయి. = కొన్ని పంచాయతీల్లో బిల్లులు చెల్లించ కపోవడంతో రెండు నెలల క్రితం ఫీజులు తొలగించారు. దీంతో పల్లెల్లో అంధకారం అలుముకుంది. శాశ్వత భవనాల సమస్య = పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు మూడేళ్ల కిందట 350 కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఒక్కోదానికి రూ.10 లక్షలు విడుదలయ్యాయి. = పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు పనులు అప్పగించారు. ఇప్పటికి కనీసం 100 కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఇక తాగునీటి సమస్య ఉండనే ఉంది. = పంచాయతీల అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. = {పభుత్వం విడుదల చేయాల్సిన సెస్‌లు, కొత్తపన్నులు దాదాపు రూ.200 కోట్ల వరకు బకాయి పడినట్లు సర్పంచుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. = నిధుల లభ్యత లేకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.