సకాలంలో వైద్యం అందక
వేర్వేరు చోట్ల ఇద్దరు బాలింతలు, ఓ శిశువు మృతి
ఆదోని టౌన్/ ఎమ్మిగనూరు రూరల్:
మాతా, శిశు సంక్షేమం కోసం రూ. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాని ప్రభుత్వాలు చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందక మహిళలు మృత్యువాత పడుతున్నారు. గురువారం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలింతలు, ఓ శిశువు మృత్యువాత పడ్డారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన శేఖర్, సావిత్రి దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో వరుసగా ఇద్దరు కుమార్తెలు. సావిత్రి మళ్లీ గర్భిణి కావడంతో ప్రసవం కోసం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ పండంటి మగ బిడ్డకు జన్మనించింది. కాన్పు సమయంలో ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. ఆదోనికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. శిశువు కూడా అపస్మారక స్థితికి చేరుకోవడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకనే తన భార్య, కుమారుడు మృతి చెందాడని శేఖర్ కన్నీరుమున్నీరుగా రోదించాడు.