తెగిన వృద్ధుడి చెవులు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : ఎండతీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలో ఓ 80 ఏళ్ల వృద్ధుడికి తెగి వేలాడుతున్న రెండు చెవులకు స్థానిక ప్రైవేట్ వైద్యుడు సకాలంలో శస్త్రచికిత్స చేసి వాటిని తిరిగి అతికించారు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండలం తక్కెళ్లపాడునకు చెందిన సుమారు 80 ఏళ్ల వయస్సు ఉన్న కర్రి వెంకటరెడ్డి 15 రోజుల క్రితం పట్టణంలోని డీఎస్ చెరువు వద్ద ఉన్న చిన్న కూతురు ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం ఇంట్లో వెంకటరెడ్డి అల్పాహారం తిన్న అనంతరం శేషమహల్ థియేటర్ రోడ్డులో నడుచుకుంటూ వెళుతుం డగా, ఎండ ధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. కొందరు ఆటోలో అతనిని కు మార్తె ఇంటికి చేర్చారు. అయితే కుమార్తె పరిశీలనగా చూడగా దాదాపుగా ఎడమ చెవి తెగి వేలాడుతుండగా, రెండో చెవి పాక్షికంగా తెగిఉండటాన్ని గమనించి హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి సూర్య ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ పట్నాల సత్యశ్రీనివాస్ అతనిని పరిశీలించి శస్త్ర చికిత్స చేసి తెగిన రెండు చెవులను అతికించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.