అమ్మకానికి మీడియా దిగ్గజాలు
న్యూయార్క్: పాఠకుల సంఖ్య, ప్రకటనల ఆదాయాలు తగ్గిపోతుండటంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పలు అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు ఒక్కొక్కటిగా అమ్మకానికి వస్తున్నాయి. కోటీశ్వరుల జాబితాలతో ప్రాచుర్యం తెచ్చుకున్న ఫోర్బ్స్ మ్యాగజైన్‌ని ప్రచురించే .. ఫోర్బ్స్ మీడియా కూడా తాజాగా అమ్మకానికి వస్తోంది. విక్రయం ద్వారా కనీసం 400 మిలియన్ డాలర్లయినా రావొచ్చని కంపెనీ యాజమాన్యం అంచనా వేస్తోంది.
ఇందుకు సంబంధించి మంచి ఆఫర్లు వస్తున్నాయంటూ ఫోర్బ్స్ మీడియా సీఈవో మైఖేల్ పెర్లిస్ ఇటీవలే సిబ్బందికి రాసిన ఈమెయిల్లో పేర్కొన్నారు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఇచ్చే సంస్థలేమైనా ఉన్నాయేమో అన్వేషించే పనిని డాయిష్ బ్యాంక్‌కి కంపెనీ పురమాయించింది. ప్రస్తుతం ఫోర్బ్స్‌ని టైమ్ సంస్థ కొనొచ్చనే ఊహాగానాలున్నాయి. బిజినెస్ జర్నలిజంలో మంచి పేరున్న ఫోర్బ్స్ పత్రికను 1917లో బీసీ ఫోర్బ్స్ ప్రారంభించారు. 2010లో తొలిసారిగా ఫోర్బ్స్ కుటుంబానికి చెందని బయటి వ్యక్తి పెర్లిస్ సీఈవో పగ్గాలు చేపట్టి, మెరుగైన పనితీరు సాధించారు.
ఈ ఏడాదే, ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ తన న్యూ ఇంగ్లాడ్ మీడియా గ్రూప్ హోల్డింగ్స్‌ను వ్యాపార వేత్త జాన్ హెన్రీకి విక్రయించింది. సుమారు 70 మిలియన్ డాలర్లు పొందింది. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ది వాషింగ్టన్ పోస్ట్ కంపెనీని ఇటీవలే ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం 250 మిలియన్ డాలర్లు వెచ్చించారు.