శేషాచలంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డుకు సమీపంలోని దట్టమైన అటవీప్రాంతంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రభుత్వ అటవీశాఖ పరిధిలోని తిమ్మినాయుడు పరిధిలోని సానరాళ్ల మిట్ట ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి పొగ అల్లుకుంది. దీనిపై సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది స్పందన అంతగా కనిపించలేదు. ఫలితంగా సాయంత్రం తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు వైపునకు మంటలు వ్యాపించాయి.
దీనిపై టీటీడీ అటవీశాఖ అప్రమత్తమైంది. 34వ మలుపు ఎలుగుబంటి బోర్డునకు ఉత్తరదిశలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించాయి. తమ పరిధి కాకపోయినా మంటలు ఆర్పేందుకు టీటీడీ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. సుమారు వందమంది కార్మికులు అటవీప్రాంతంలోకి వెళ్లి మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. ఈ రాత్రి 10 గంటల వరకు మంటలు ఎగసిపడ్డాయి. ఈ రాత్రికి మంటలు పూర్తిగా ఆర్పివేస్తామని టీటీడీ డీఎఫ్‌వో శివరామ్‌ప్రసాద్ తెలిపారు.