విశాఖలో తిరుమల వెంకన్న
ఎండాడలో భారీ ఆలయ నిర్మాణం
10 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తిరుమల వెంకన్న కొలువుదీరనున్నాడు. ఏడుకొండలవాడు ఎండాడలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నాడు. నగరంలో తిరుమల తరహాలో వేంకటేశ్వరుని ఆలయం నిర్మాణానికి సర్కారు సూ త్రప్రాయంగా అంగీకరించింది. తిరుమల వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం కోసం బుధవారం విశాఖ శివారులోని ఎండాడ సర్వే నంబరు 20పి, 191పిలో 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబరు 829ను జారీ చేసింది. ఈ భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వాధీనం చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేసీ శర్మ జీవోలో పేర్కొన్నారు. ఇందుకవసరమయ్యే నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే అవకాశం ఉంది. వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం పూర్తయితే తిరుమలలో మాదిరిగానే పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం భూమి కేటాయించడంతో సత్వరమే దివ్యక్షేత్రం పనులు మొదలై చకచకా పూర్తవుతాయని వెంకన్న భక్తులు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే విశాఖ ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం, దానికి ఎదురుగా టీటీడీ వారి ఈ–దర్శనం కౌంటరు ఉన్నాయి. రెండేళ్ల క్రితం నేరుగా తిరుమల నుంచి వెంకన్న లడ్డూలను కూడా రప్పించి ఒక్కొక్కటి రూ.25ల చొప్పున భక్తులకు అందజేసేవారు. కొన్నాళ్ల తర్వాత వాటి పంపిణీని నిలిపివేశారు. టీటీడీ దివ్యక్షేత్రం పూర్తయితే వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి వస్తాయి.