‘టింటూ స్వర్ణం తెస్తుంది’
ముంబై: భారత యువ అథ్లెట్ టింటూ లూకాకు ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించగల సత్తా ఉందని ఆమె కోచ్, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష విశ్వాసం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న తన శిష్యురాలు ఈసారి మాత్రం పసిడి పతకంతో తిరిగొస్తుందని ఆమె ధీమాతో చెప్పింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జులై 21 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతాయి.
‘ప్రస్తుతం టింటూ లూకా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె 800 మీటర్ల రేసును ఒక నిమిషం 59 సెకన్లలోపు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది పలు ముఖ్య పోటీలు ఉన్న నేపథ్యంలో టింటూకు వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది’ అని ఉష పేర్కొంది.