ప్రియుడు కాల్ రిసీవ్ చేసుకోలేదని..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడు మొబైల్ కాల్ రిసీవ్ చేసుకోలేదని కలత చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నెలమంగల తాలూకా తిప్పగొండన హళ్లిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజియా ఖాటూన్(19) స్థానిక అంబిక నర్సింగ్ కళాశాలలో ఫస్టియర్ డిప్లొమా నర్సింగ్ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న సమీం అల్సబ్‌తో కొంతకాలంగా ఆమె ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సమీపంలోని ఒక ప్రైవేటు తోటలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఇద్దరూ ఒక రోజు కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
మొదట వెళ్లిన రజియా అల్సబ్‌కు పలుమార్లు ఫోన్ చేసింది. అయితే, అతడు కాల్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రజియా అక్కడే ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత నిర్వాహకులు గదిలో చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం ముగిసిన తరువాత విమానంలో సొంతరాష్ట్రానికి తీసుకువెళ్లవచ్చని తెలిసింది.